IPL ఫ్యాన్స్‎కు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 6న జరగాల్సిన లక్నో, KKR మ్యాచ్ వేదిక మార్పు

IPL ఫ్యాన్స్‎కు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 6న జరగాల్సిన లక్నో, KKR మ్యాచ్ వేదిక మార్పు

క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ధనాధన్ లీగ్ కోసం కేవలం ఇండియన్ ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో తలపడేందుకు ఇప్పటికే అన్ని జట్లు సర్వం సిద్ధం అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‎కతా నైట్ రైడర్స్, ఐపీఎల్‎లో మోస్ట్ పాపులర్ టీమ్ ఆర్సీబీ లీగ్ తొలి మ్యాచులో తలపడబోతున్నాయి. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పోరుకు తెరలేవనున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2025, ఏప్రిల్ 6న కేకేఆర్, లక్నో మధ్య జరగనున్న మ్యాచ్ వేదికను మార్చింది. 

ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ కోల్‎కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‎లో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఉన్న రోజే (ఏప్రిల్ 6) శ్రీరామ నవమి పండుగ ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి యేటా కోల్‎కతాలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. పండుగ రోజున పశ్చిమ బెంగాల్ అంతటా దాదాపు 20వేలకు పైగా ఊరేగింపులు నిర్వహించే అవకాశం ఉంది. కోల్‎కతాలో శ్రీరామ నవమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశం ఉండటంతో.. అటు ఊరేగింపు వేడుకలకు.. ఇటు మ్యాచుకు బందోబస్తు ఇవ్వడం కష్టమని కోల్ కతా పోలీసులు ఐపీఎల్ మ్యాచుకు అనుమతి నిరాకరించారు.

 పోలీసులు పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడంతో ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‎లో జరగాల్సిన మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చింది. ఈ మ్యాచును గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపింది. దీంతో ఏప్రిల్ 6న కేకేఆర్, లక్నో ఈడెన్ గార్డెన్స్‎లో కాకుండా బర్సపర క్రికెట్ స్టేడియంలో తలపడాల్సి ఉంటుంది. అయితే.. వేదికను మార్చకుండా మ్యాచును రీ షెడ్యూల్ చేయాలని వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐని కోరగా.. ఆ రిక్వెస్ట్‎ను బీసీసీఐ సున్నితంగా తిరస్కరించిందని క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ వెల్లడించారు.