- 1 పరుగుతో కేకేఆర్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
- మూడో ప్లేస్‌తో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై
కోల్‌కతా: లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చింది. శనివారం రాత్రి జరిగిన తమ చివరి లీగ్ పోరులో రింకూ సింగ్ (33 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 నాటౌట్) వణికించినా ఒక్క రన్ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచి గట్టెక్కింది. ఎనిమిదో విజయం, 17 పాయింట్లతో మూడో ప్లేస్‌తో ప్లేఆఫ్స్ చేరుకుంది. తొలుత నికోలస్ పూరన్ (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 58) మెరుపులతో లక్నో 20 ఓవర్లలో 176/8 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో కేకేఆర్ 20 ఓవర్లలో 175/7తో కొద్దిలో విజయం చేజార్చుకుంది. స్టార్టింగ్‌లో జేసన్ రాయ్ (28 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), చివర్లో రింకూ దంచినా ఫలితం లేకపోయింది. పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
పూరన్ ధనాధన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ కరణ్ శర్మ (3) మూడో ఓవర్లోనే హర్షిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. డికాక్ (28), ప్రేరక్ మన్కడ్(26) వరుస బౌండ్రీలతో పవర్‌ప్లేను 54/1 ముగించారు. కానీ, ఏడో ఓవర్లో మూడు బాల్స్ తేడాతో ప్రేరక్, స్టార్ బ్యాటర్ స్టోయినిస్ (0)ను ఔట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు. కెప్టెన్ క్రునాల్ (9) ఫెయిలవగా, చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో డికాక్ కూడా ఔటయ్యాడు. కానీ, తర్వాతి మూడు బాల్స్‌ను 4,4,6గా మార్చిన పూరన్ జట్టును ఆదుకున్నాడు. బదోని (25)సపోర్ట్‌తో చెలరేగిపోయాడు. నరైన్ వేసిన 18వ ఓవర్లో బదోనీ 4,6తో గేరు మార్చినా తర్వాతి బాల్‌కే ఔట్ అవడంతో ఆరో వికెట్‌కు 74 రన్స్‌పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. శార్దూల్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన పూరన్ మూడో బాల్‌కు ఔటైనా.. చివరి ఓవర్లో రసెల్ (11 నాటౌట్) 6, 4తో ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వైభవ్, శార్దూల్, నరైన్ తలో రెండు వికెట్లు తీశారు.
వణికించిన రింకూ
నార్మల్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్లు రాయ్, వెంకటేశ్ అయ్యర్ (24) మెరుపులతో5 ఓవర్లకే స్కోరు 50 దాటింది. కానీ, ఆరో ఓవర్లో కృష్ణప్ప గౌతమ్.. వెంకటేశ్‌ను ఔట్ చేసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో రింకూ పోరా డుతున్నా నితీష్ (8) గుర్బాజ్ (10), రసెల్ (7), శార్దూల్ (3), నరైన్ (1) ఫెయియ్యారు. చివరి రెండు ఓవర్లలో 41 రన్స్ అవసరమైన టైమ్‌లో రింకూ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 19వ ఓవర్లో 4,4,4,6 సహా 20 రన్స్ రాబట్టి జట్టును రేసులోకి తెచ్చాడు. యశ్ వేసిన చివరి ఓవర్లో తొలి 3 బాల్స్‌కు 3 రన్సే వచ్చాయి. ఆఖరి మూడు బాల్స్‌కు 18 రన్స్ అవసరం కాగా రింకూ 6,4,6 కొట్టడంతో కేకేఆర్ విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 176/8 (పూరన్ 58, డికాక్ 28, శార్దూల్ 2/27, నరైన్ 2/28).
కోల్‌కతా: 20 ఓవర్లలో 175/7 (రింకూ 67*, రాయ్ 45, బిష్ణోయ్ 2/23, యశ్ ఠాకూర్ 2/31).