ఈడెన్ గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయడంఖా మోగించింది. లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నాలుగో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట లక్నో 161 పరుగులు చేయగా.. కోల్‌కతా బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. పసలేని లక్నో బౌలింగ్ లైనప్‌ను చీల్చి చెండాడుతూ 15.4 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మ్యాచ్ అమాంతం ఏకపక్షంగా సాగింది.
మొదటి ఓవర్‌లోనే 22 పరుగులు
162 పరుగుల చేధనను కోల్‌కతా ధాటిగానే ఆరంభించింది. షమర్ జోసెఫ్ వేసిన మొదటి ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. అక్కడ ప్రారంభమైన పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగలేదు. సునీల్ నరైన్(6), అంగ్‌క్రిష్ రఘువంశీ(7) త్వరగా పెవిలియన్ చేరినా.. మరో ఎండ్ నుంచి ఫిలిప్ సాల్ట్(89 నాటౌట్; 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) బౌండరీల మోత మోగిస్తూనే వచ్చాడు. ఓవర్‌కు రెండు, మూడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి శ్రేయాస్ అయ్యర్(38 నాటౌట్; 38 బంతుల్లో 6 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు.
అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(45; 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రాహుల్(39; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు.