
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడబోతుంది. శనివారం (మార్చి 22) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండు జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం.. ఆర్సీబీకి బ్రాండ్ ఇమేజ్ ఉండడంతో ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్,జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. సొంత గడ్డ కావడంతో ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతుంది. 7 గంటలకు టాస్.. 7:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ కు ముందు ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
ఓపెనర్లుగా కోహ్లీ, సాల్ట్:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్ లో ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగబోతుందో ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా కోహ్లీ, ఇంగ్లాండ్ విధ్వంసకర వీరుడు సాల్ట్ దిగడం ఖాయమైపోయింది. మూడో స్థానంలో కెప్టెన్ పటిదార్ బ్యాటింగ్ కు వస్తాడు. జితేష్ శర్మ, లివింగ్ స్టోన్,టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. క్రునాల్ పాండ్య ఆల్ రౌండర్ గా బరిలోకి దిగుతాడు. ఫాస్ట్ బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్ తుది జట్టులో ఉండడం ఖాయం. ఏకైక స్పిన్నర్ గా సుయాష్ శర్మ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ గా దేవ్‌దత్ పడిక్కల్ బరిలోకి దిగొచ్చు.
మిస్టరీ స్పిన్నర్లతో బలంగా కోల్‌కతా:
సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్ లో కేకేఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓపెనర్లుగా డికాక్ తో పాటు సునీల్ నరైన్ ఓపెనింగ్ చేయనున్నారు. మూడో స్థానంలో కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ కు వస్తాడు. రూ. 23 కోట్ల వీరుడు వెంకటేష్ అయ్యర్ నాలుగో స్థానంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రింకూ సింగ్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్ మిడిల్ ఆర్డర్ లో వస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా స్పెన్సర్ జాన్సన్, నోర్జ్ లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరో ఇద్దరు భారత పేసర్లతో కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా యువ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీకి ఛాన్స్ దక్కొచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు (అంచనా) :
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్, సుయాష్ శర్మ/రశిఖ్ దార్ సలాం
కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు (అంచనా):
సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి