ధోనీసేన విలవిల.. 8 వికెట్ల తేడాతో చెన్నైపై కేకేఆర్ ఘన విజయం

ధోనీసేన విలవిల.. 8 వికెట్ల తేడాతో చెన్నైపై కేకేఆర్ ఘన విజయం

చెన్నై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 18వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో వరుసగా ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓడింది. గాయంతో లీగ్‌‌‌‌‌‌‌‌కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌‌‌‌‌‌‌‌ ధోనీ తిరిగి కెప్టెన్సీ అందుకున్న పోరులో సీఎస్కే మరింత చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ల  బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వణికిపోయిన సీఎస్కే 20 ఓవర్లు ఆడి చచ్చీచెడి103 రన్స్ కొట్టింది. ఫలితంగా  చెపాక్‌‌‌‌‌‌‌‌లో స్టేడియంలో తమ లోయెస్ట్‌‌‌‌‌‌‌‌ స్కోరు నమోదు చేసిన ధోనీసేన 8 వికెట్ల తేడాతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సీఎస్కే 20 ఓవర్లలో 103/9 స్కోరు చేసింది. 

శివం దూబే (29 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లతో 31 నాటౌట్‌‌‌‌‌‌‌‌), విజయ్ శంకర్ (21 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 29) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. ఇద్దరు డకౌట్ అవ్వగా.. కెప్టెన్ ధోనీ (1) సహా మరో ఐదుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితం అయ్యారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ (3/13) మూడు వికెట్లతో దెబ్బకొట్టగా.. హర్షిత్ రాణా (2/16), వరుణ్ చక్రవర్తి (2/22) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం కేకేఆర్ 10.1 ఓవర్లలోనే 107/2 స్కోరు చేసి గెలిచింది. బ్యాట్‌‌‌‌‌‌‌‌తోనూ మెరిసిన సునీల్ నరైన్ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 44) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. అతనికే ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది.

స్పిన్ వలలో చిక్కి

సొంతగడ్డపై స్పిన్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించే చెపాక్ వికెట్‌‌‌‌‌‌‌‌పై చెన్నై బ్యాటర్లు బోల్తా కొట్టారు. కేకేఆర్ స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌‌‌‌‌‌‌‌, మొయిన్ అలీని ఎదుర్కోలేక విలవిలలాడారు. ఈ ముగ్గురు బౌలర్లు 12 ఓవర్లలో56 రన్స్ మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో సీఎస్కే వంద స్కోరు చేసేందుకే ఇక్కట్లు పడింది. ధోనీ టాస్ నెగ్గినా..  ఆటలో మాత్రమే కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే పూర్తి పైచేయి సాధించింది. చెన్నై జట్టులో లెఫ్టాండర్లను దెబ్బకొట్టేందుకు కెప్టెన్ రహానె రెండో ఓవర్లోనే స్పిన్నర్ మొయిన్ అలీ దింపాడు. గత సీజన్‌‌‌‌‌‌‌‌ వరకు సీఎస్కేకు ఆడి చెపాక్ పిచ్‌‌‌‌‌‌‌‌పై మంచి అవగాహన ఉన్న అలీ.. తన రెండో ఓవర్లోనే ఓపెనర్ డెవాన్ కాన్వే (12)ను ఎల్బీ చేసి ఆతిథ్య జట్టు పతనం మొదలు పెట్టాడు.

ఐదో ఓవర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పేసర్ హర్షిత్ రాణా.. తన మొదటి బాల్‌‌‌‌‌‌‌‌కే రచిన్ రవీంద్ర (4)ను పెవిలియన్ చేర్చగా.. పవర్ ప్లేను సీఎస్కే 31/2తో ముగించింది. చక్రవర్తి బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు, అలీ ఓవర్లో ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన విజయ్ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, పదో ఓవర్లో చక్రవర్తి అతడిని పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చగా.. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి (16)ని నరైన్ బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి కోల్‌‌‌‌‌‌‌‌కతా బౌలర్లు మరింత జోరు పెంచడంతో అశ్విన్ (1), జడేజా (0) కూడా ఫెయిలయ్యారు. 

దీపక్ హుడా (0)ను చక్రవర్తి డకౌట్ చేయడంతో 71/7తో నిలిచిన సీఎస్కే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో తమ లోయెస్ట్ స్కోరు (79) రికార్డును బ్రేక్ చేసేలా కనిపించింది. తొమ్మిదో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రీజులోకి వచ్చిన ధోనీ నాలుగు బాల్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఆడి నరైన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఎల్బీ అయ్యాడు. దీనికి ఓ రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. కేకేఆర్ బౌలర్ల దెబ్బకు 9 నుంచి 18 ఓవర్ల మధ్యలో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. హిట్టర్ శివం దూబే చివరి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టడంతో సీఎస్కే అతి కష్టంగా వంద రన్స్‌‌‌‌‌‌‌‌  మార్కు అందుకుంది. 

59 బాల్స్ మిగిలుండగానే.. 

సీఎస్కే ఇచ్చిన చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కేకేఆర్ ఈజీగా ఛేజ్ చేసింది. ఆతిథ్య బ్యాటర్లు తేలిపోయిన పిచ్‌‌‌‌‌‌‌‌పై కోల్‌‌‌‌‌‌‌‌కతా ఓపెనర్లు నరైన్‌‌‌‌‌‌‌‌, డికాక్ (23) స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే అదరగొట్టారు.  తొలి రెండు ఓవర్లలోనే చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌తో సీఎస్కే బౌలర్లపై ఎదురుదాడి మొదలు పెట్టారు. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో డికాక్‌‌‌‌‌‌‌‌ రెండు సిక్సర్లతో జోరు పెంచగా.. అశ్విన్‌‌‌‌‌‌‌‌కు నరైన్‌‌‌‌‌‌‌‌ 4,6తో స్వాగతం పలికాడు. అన్షుల్‌‌‌‌‌‌‌‌ కంబోజ్‌‌‌‌‌‌‌‌ వేసిన ఐదో ఓవర్లో డికాక్ ఔటవ్వడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 46 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. కానీ, ఖలీల్ వేసిన ఆరో ఓవర్లో  కెప్టెన్ రహానె (20 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సిక్స్‌‌‌‌‌‌‌‌, నరైన్ 6, 4 బాదడంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలోనే కేకేఆర్ 71/1తో నిలిచింది. అశ్విన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన నరైన్‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీ చేసేలా కనిపించాడు. కానీ, నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్ అతడిని బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసినా.. రహానెకు తోడైన రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌‌‌‌‌) జడేజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో మరో 59 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు

చెన్నై: 20 ఓవర్లలో 103/9 (శివం దూబే 31*, శంకర్ 26,  నరైన్ 3/13, హర్షిత్ 2/16).

కోల్‌‌‌‌‌‌‌‌కతా: 10.1 ఓవర్లలో 107/2 (నరైన్ 44, డికాక్‌‌‌‌‌‌‌‌ 23, నూర్ అహ్మద్ 1/8).