- రాణించిన రసెల్, వెంకటేశ్, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా: ఐపీఎల్17లో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్‌ను మరోసారి పడగొట్టి లీగ్‌లో తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్ చేరింది. వెంకటేశ్ అయ్యర్ (21 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) మెరుపులకు తోడు రసెల్ (2/15), వరుణ్ చక్రవర్తి (2/17), హర్షిత్ రాణా (2/34) సూపర్ బౌలింగ్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 రన్స్ తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత కేకేఆర్ 157/7 స్కోరు చేసింది.
వెంకటేశ్ అయ్యర్ (21 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), నితీష్ రాణా (23 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) రాణించారు. బుమ్రా, చావ్లా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో ముంబై ఓవర్లలో 139/8 స్కోరు చేసి ఓడింది. ఇషాన్ కిషన్ (22 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), తిలక్ వర్మ (17 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) పోరాడినా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు.
ఆదుకున్న వెంకటేశ్, రాణా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినా వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్ పోరాటంతో మంచి స్కోరు చేసింది. తొలుత పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకున్న ముంబై పేసర్లు ఏడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్ తొలి బాల్‌కే సిక్స్ కొట్టిన ఫిల్ సాల్ట్ (6)ను ఐదో బాల్‌కు నువాన్ తుషార స్లో బాల్‌తో పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్లో మొదటి బాల్‌కే అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌తో నరైన్ (0)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బాల్‌కు కనీసం బ్యాట్ కూడా కదల్చలేక బిత్తరపోయిన నరైన్ గోల్డెన్ డకౌటయ్యాడు.
10/2తో ఇబ్బందుల్లో పడిన కేకేఆర్‌ను వెంకటేశ్ ఆదుకున్నాడు. కంబోజ్ బౌలింగ్‌లో సిక్స్‌తో టచ్‌లోకి వచ్చిన అతను బుమ్రా ఓవర్లో 4, 6, 4 తో వేగం పెంచాడు. కానీ, కెప్టెన్ శ్రేయస్ (7) నిరాశ పరిచాడు. ఐదో ఓవర్లో అతడిని కంబోజ్ బౌల్డ్ చేయడంతో కేకేఆర్ 40/3తో నిలిచింది. ఈ టైమ్‌లో నితీష్ రాణా తోడుగా వెంకటేశ్ పోరాటం కొనసాగించాడు. ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టారు. హార్దిక్ వేసిన ఎనిమిదో ఓవర్లో వెంకటేశ్ ఫోర్, రాణా 4, 6తో 16 రన్స్ పిండుకున్నారు. అయితే, ఫిఫ్టీ దిశగా వెళ్తున్న వెంకటేశ్.. స్పిన్నర్ చావ్లా బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడి సూర్యకు చిక్కాడు.
అయితే అదే ఓవర్లో ఆండ్రీ రసెల్ (24) 6, 4తో జోరు చూపెట్టాడు. తుషార ఓవర్లో సిక్స్, చావ్లా బౌలింగ్‌లో ఫోర్‌తో స్కోరు వంద దాటించాడు. ఇక బుమ్రా వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లతో స్పీడ్ పెంచిన రాణా అదే ఓవర్లో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ట్రై చేసిన రసెల్ కూడా పెవిలియన్ చేరాడు. ముంబై బౌలర్లు పుంజుకున్నా ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్ (20) బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో పెవిలియన్ చేరగా.. లాస్ట్ బాల్‌ను సిక్స్‌గా మలిచిన రమణ్‌దీప్ సింగ్ (17 నాటౌట్) స్కోరు 150 దాటించాడు.
ఇషాన్, తిలక్ మెరిసినా
ఛేజింగ్‌లో ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (19) తొలి వికెట్‌కు 65 రన్స్ జోడించి మంచి పునాదే వేసినా తర్వాత అనూహ్యంగా తడబడిన ముంబై చేజేతులా ఓడింది. రోహిత్ నిదానంగా ఆడటం దెబ్బతీసింది. ఇషాన్ మాత్రం ఉన్నంతసేపు భారీ షాట్లతో చెలరేగాడు. వైభవ్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా.. తర్వాతి ఓవర్లో ఇషాన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో స్పీడ్ పెంచాడు. నరైన్ బౌలింగ్‌లో 4, 6 కొట్టడంతో పవన్ ప్లేలో (5 ఓవర్లు) ముంబై 59/0తో నిలిచింది. కానీ, ఏడో ఓవర్లో ఇషాన్‌ను ఔట్ చేసిన నరైన్ కేకేఆర్‌కు బ్రేక్ ఇవ్వగా.. ఆ వెంటనే చక్రవర్తి బౌలింగ్‌లో రోహిత్ పెవిలియన్ చేరడంతో ముంబైకి డబుల్ షాక్ తగిలింది.
ఇక్కడి నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్లు వరుస వికెట్లతో హోరెత్తించారు. సూర్యకుమార్ (11), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (3), హిట్టర్ టిమ్ డేవిడ్ (0) ఫెయిలవడంతో 92/5తో ముంబై పూర్తిగా డీలా పడింది. అయితే, 18 బాల్స్‌లో 57 రన్స్ అవసరం అయిన దశలో హర్షిత్ వేసిన 14వ ఓవర్లో 4, 6, 4 కొట్టిన తిలక్ వర్మ ఆ జట్టును రేసులోకి తెచ్చాడు. ఆ ఓవర్ చివరి బాల్‌కు నేహల్ (3) రనౌటైనా.. కొత్తగా క్రీజులోకి వచ్చిన నమన్ ధీర్ (17). రసెల్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు, ఫోర్ కొట్టి ఆశలు రేపాడు. చివరి ఆరు బాల్స్‌లో ముంబైకి 22 రన్స్ అవసరం అవగా మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేగింది. ఆఖరి ఓవర్లో నమన్, తిలక్‌ను ఔట్ చేసిన హర్షిత్ మూడే రన్స్ ఇచ్చి కేకేఆర్‌ను గెలిపించాడు.
టీ20ల్లో అత్యధికంగా 44 సార్లు డకౌటైన క్రికెటర్ సునీల్ నరైన్ .. అలెక్స్ హేల్స్ (43) రికార్డును బ్రేక్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 16 ఓవర్లలో 157/7 (వెంకటేశ్ 42, రాణా 33, చావ్లా 2/28, బుమ్రా 2/39)
ముంబై: 16 ఓవర్లలో .. (ఇషాన్ 40, రసెల్ 2/15, చక్రవర్తి 2/17)