- 4 రన్స్ తేడాతో కోల్‌కతా విజయం
- చెలరేగిన రసెల్, సాల్ట్, రాణా
కోల్‌కతా: భారీ టార్గెట్ ఛేజింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (29 బాల్స్‌లో 8 సిక్స్‌లతో 63) దుమ్మురేపినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్‌లో 13 రన్స్ కావాల్సిన దశలో తొలి బాల్‌ను సిక్స్‌గా మలిచిన క్లాసెన్, షాహబాజ్ అహ్మద్ (16) మూడు బాల్స్ తేడాలో ఔట్ కావడం, లాస్ట్ బాల్‌కు 5 రన్స్ చేయలేకపోవడంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 రన్స్ స్వల్ప తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది.
టాస్ ఓడిన నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 208/7 స్కోరు చేసింది. ఆండ్రీ రసెల్ (25 బాల్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్), ఫిల్ సాల్ట్ (40 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54), రమణ్‌దీప్ సింగ్ (35) దంచికొట్టారు. తర్వాత హైదరాబాద్ 20 ఓవర్లలో 204/7 స్కోరు చేసింది. రసెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రసెల్ జోరు..
ముందుగా కోల్‌కతాకు ఫిల్ సాల్ట్ అదిరిపోయే ఆరంభాన్నివ్వగా, చివర్లో రసెల్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. రెండో ఓవర్‌లో సాల్ట్ హ్యాట్రిక్ సిక్సర్స్ కొట్టగా, ఆఖరి బాల్‌కు నరైన్ (2) రనౌటయ్యాడు. 4వ ఓవర్‌లో నటరాజన్ (3/32) మూడు బాల్స్ తేడాలో వెంకటేశ్ అయ్యర్ (7), శ్రేయస్ అయ్యర్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో నైట్‌రైడర్స్ 32/3తో కష్టాల్లో పడింది.
నితీష్ రాణా (9) కూడా ఫెయిల్ కావడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 43/3 స్కోరు చేసింది. ఈ దశలో రమణ్‌దీప్ 4, 6, 6తో టచ్‌లోకి రావడంతో ఫస్ట్ టెన్‌లో కోల్‌కతా 77/4 స్కోరు చేసింది. 12వ ఓవర్‌లో రమణ్‌దీప్ నో బాల్ సిక్స్, ఆ తర్వాత ఫోర్ దంచాడు. కానీ 13వ ఓవర్ ఫస్ట్ బాల్‌కే ఔట్ కావడంతో ఐదో వికెట్‌కు 54 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. రింకూ సింగ్ (23) ఫోర్‌తో ఖాతా తెరిచినా, 14వ ఓవర్‌లో సాల్ట్ వెనుదిరిగాడు. 15 ఓవర్లలో 123/6గా ఉన్న స్కోరును రసెల్, రింకూ పరుగులు పెట్టించారు. 16, 17 ఓవర్లలో రసెల్ 6, 6, 6, 6, 4, 4 దంచాడు. 18వ ఓవర్‌లో రింకూ 4, రసెల్ 6తో 15 రన్స్ రాబట్టారు. 19వ ఓవర్‌లో రసెల్ 5 నోబాల్స్, 6, 6, 4తో 26 రన్స్ పిండుకున్నాడు. అయితే లాస్ట్ ఓవర్‌లో రింకూ ఔట్ కావడంతో ఏడో వికెట్‌కు 33 బాల్స్‌లో 81 రన్స్ జతయ్యాయి.
మెరుగైన ఆరంభం..
భారీ ఛేజింగ్‌లో మయాంక్ (32), అభిషేక్ (32) మంచి ఆరంభాన్నిచ్చారు. 4వ ఓవర్‌లో మయాంక్ 6, 4తో జోరు పెంచాడు. తర్వాతి ఓవర్‌లో అభిషేక్ 4, 6, 6 దంచాడు. కానీ ఆరో ఓవర్‌లో మయాంక్ ఔట్ కావడంతో ఫస్ట్ వికెట్‌కు 60 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయ్యింది. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 65/1 స్కోరు చేసింది. 8వ ఓవర్‌లో రసెల్ (2/25) దెబ్బకు జోరుమీదున్న అభిషేక్ వెనుదిరిగాడు.
ఈ దశలో మార్‌క్రమ్ (18), రాహుల్ త్రిపాఠి (20) సిక్స్, ఫోర్‌తో కుదురుకున్నారు. 10 ఓవర్‌లో క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డ త్రిపాఠి స్కోరును 99/2కు పెంచాడు. కానీ 12, 13వ ఓవర్స్‌లో వరుసగా మార్‌క్రమ్, త్రిపాఠి ఔట్ కావడంతో రైజర్స్ ఇన్నింగ్స్ తడబడింది. ఇక్కడి నుంచి అబ్దుల్ సమద్ (15), క్లాసెన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. 15వ ఓవర్‌లో క్లాసెన్ రెండు సిక్స్‌లతో రెచ్చిపోయాడు. 17వ ఓవర్‌లో 6, 4 కొట్టి సమద్ ఔటయ్యాడు. షాహబాజ్ ఫోర్‌తో ఖాతా తెరవగా, 18వ ఓవర్‌లో క్లాసెన్ 6, 6, 6తో 21.. 19వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో 26 రన్స్ దంచాడు.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా: 20 ఓవర్లలో 208/7 (రసెల్ 64, సాల్ట్ 54, రమణ్‌దీప్ 35, నటరాజన్ 3/32).
హైదరాబాద్: 20 ఓవర్లలో 204/7 (క్లాసెన్ 63, మయాంక్ 32, హర్షిత్ 3/33)