GT vs DC: సిక్సర్లలో రాహులే కింగ్.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా కేఎల్ రికార్డ్

GT vs DC: సిక్సర్లలో రాహులే కింగ్.. ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా కేఎల్ రికార్డ్

ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం (ఏప్రిల్ 19) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సిక్సర్ కొట్టి ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ మూడో బంతిని రాహుల్ లంగాన్ దిశగా సిక్సర్ కొట్టి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సిక్సర్ తో ఐపీఎల్ చరిత్రలో వేగంగా 200 సిక్సులు కొట్టిన ఇండియన్ బ్యాటర్ గా రాహుల్ నిలిచాడు. ఓవరాల్ గా 200 సిక్సర్లు కొట్టిన ఆరో ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. 129 ఇన్నింగ్స్ లో రాహుల్ 200 సిక్సులు కొట్టడం విశేషం. 

ఓవరాల్ గా భారత క్రికెటర్లలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 258 ఇన్నింగ్స్ ల్లో 286 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అగ్ర స్థానంలో ఉన్నాడు. కోహ్లీ (282), ధోనీ (260), సంజు శాంసన్ (216), రైనా (203) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 200 సిక్సర్లతో పాటు 420 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్ ల్లో 158 స్ట్రైక్ రేట్ తో 266 పరుగులు చేశాడు. రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 14 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. రాహుల్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. పవర్ ప్లే లో బౌండరీల వర్షం కురిపించిన కేఎల్.. ప్రసిద్ కృష్ణ వేసిన ఒక అద్భుత బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్ లో స్టబ్స్ (8), అక్షర్ పటేల్ (15) ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.