అంతర్జాతీయ కెరీర్ లో రాహుల్ తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత 2023 ఆసియా కప్ లో ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్ కేవలం బ్యాటర్ గానే కాదు కెప్టెన్ గాను అదరగొడుతున్నాడు. తన కెప్టెన్సీతో భారత్ కు వరుస విజయాలను అందిస్తూ భవిష్యత్తు కెప్టెన్ గా కితాబులందుకుంటున్నాడు. జోహనెస్ బర్గ్ లో నిన్న(డిసెంబర్ 17) దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో రాహుల్ కెప్టెన్ గా వరుసగా పదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్ బ్రేక్ చేశాడు.
2013లో మాహీ.. టీమిండియాకు వరుసగా 9 విజయాలను అందించాడు. తాజాగా రాహుల్ వరుసగా 10 విజయాలు అందించడం ద్వారా ఈ రికార్డ్ కు బ్రేక్ పడింది. దక్షిణాఫ్రికా టూర్ లో మరో రెండు వన్డేలను భారత్ గెలిస్తే కెప్టెన్ గా రాహుల్ వరుసగా 12 విజయాలతో కోహ్లీని సమం చేస్తాడు. 2017లో విరాట్ కెప్టెన్సీలో భారత్ వరుసగా 12 మ్యాచ్ ల్లో గెలుపొందింది. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 2019-2022 సంవత్సరాల మధ్య హిట్ మ్యాన్ వరుసగా 19 మ్యాచ్ ల్లో భారత్ కు విజయాలను అందించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాపై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ కు 5 వికెట్లు, అవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసుకున్నారు.
117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా చేధించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకే ఔటైనా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్(54) తో శ్రేయాస్ అయ్యర్(52) అర్ధ సెంచరీలు చేసి టీమిండియాకు విజయాన్ని అందించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న జరుగుతుంది.
KL Rahul is the first Indian captain to win a Pink ODI. ?#KLRahul #SAvIND #Cricket #Sportskeeda pic.twitter.com/5Q9GGV0FiM
— Sportskeeda (@Sportskeeda) December 17, 2023