టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో చెలరేగి ఆడాడు. పసికూన నెదర్లాండ్స్ కు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాహుల్ 62 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్ లో భారత్ తరపున రోహిత్ శర్మ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డ్ సెంచరీని బ్రేక్ చేసాడు.
ఈ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేసిన హిట్ మ్యాన్.. వీరేంద్ర సెహ్వాగ్ 81 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీను అధిగమించాడు. తాజాగా 62 బంతుల్లో సెంచరీ చేసి ఒక్క బంతి తేడాతో రాహుల్ ఈ రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లీ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రాహుల్ ప్రారంభంలో ఆచి తూచి ఆడినా క్రమంగా వేగం పెంచాడు. 40 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్.. ఆ తర్వాత మరో 50 పరుగులు చేరుకోవడానికి కేవలం 22 బంతులు మాత్రమే అవసరమయ్యాయి.
రాహుల్ విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ 50 వ ఓవర్లో రాహుల్ సెంచరీకి 11 పరుగులు అవసరం కాగా.. వరుసగా రెండు సిక్సులు కొట్టి తన సెంచరీ మార్క్ పూర్తి చేసుకున్నాడు. రాహుల్(104) సెంచరీకి తోడు అయ్యర్(128) సెంచరీతో భారత్ ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగులు చేసింది. కోహ్లీ(51), గిల్(51), రోహిత్(61) అర్ధ సెంచరీలు చేశారు.