టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లోనే కాదు కీపింగ్ లోనూ అదరగొట్టేస్తున్నాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ కాకపోయినా రాహుల్ కీపింగ్ నైపుణ్యానికి వావ్ అనాల్సిందే. డీఆర్ఎస్, స్టంపింగ్, మెరుపు క్యాచ్ లు తీసుకోవడం రాహుల్ ప్రతిభకు నిదర్శనం. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ తన పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్న రాహుల్.. ధోనీ రికార్డ్ బ్రేక్ చేసాడు. అంతేకాదు వికెట్ కీపర్ గా మారొక క్యాచ్ అందుకుంటే సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రాహుల్ క్యాచ్, స్టంపింగ్ లతో కలుపుకొని 16 వికెట్ల పడగొట్టడంలో భాగస్వామ్యం పంచుకున్నాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (15) రికార్డ్ ను రాహుల్ బ్రేక్ చేసాడు. ప్రస్తుతం భారత్ కు వరల్డ్ కప్ లో ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మ్యాచ్ లో రాహుల్ మరో క్యాచ్ లేదా స్టంప్ చేసినా భారత మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రికార్డ్ బ్రేక్ చేస్తాడు. ఇదే జరిగితే ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక ఔట్ లు చేసిన భారత వికెట్ కీపర్ గా రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
ఓవరాల్ గా ఈ రికార్డ్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ 2003 లో 21 అవుట్ లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో డికాక్(20) టాప్ లో ఉన్నాడు. ఇక రాహుల్ బ్యాటర్ గాను ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 10 మ్యాచ్ ల్లో 386 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియాపై 97 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన రాహుల్..నెదర్లాండ్స్ పై మెరుపు సెంచరీ చేసి వరల్డ్ కప్ లో ఇండియా తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డ్ నమోదు చేసాడు. సెమీస్ లో 20 బంతుల్లోనే 39 పరుగులు చేసిన రాహుల్.. ఫైనల్ లో ఆస్ట్రేలియాపై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.