
న్యూఢిల్లీ : గాయం నుంచి కోలుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో పాల్గొనేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆరంభ మ్యాచ్‌ల్లో కీపింగ్ చేయొద్దని అతనికి సూచించింది. హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా కేఎల్ కండరా గాయంతో ఇబ్బంది పడ్డాడు. దాంతో మిగతా నాలుగు టెస్టులకు దూరంగా ఉన్న అతను ఎన్‌సీఏలో చేరి తిరిగి ఫిట్‌నెస్ సాధించాడు. ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం అతను లక్నోలో టీమ్‌తో కలవనున్నాడు. ఈ నెల 24న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఎన్‌సీఏ సూచన మేరకు కొన్ని మ్యాచ్‌ల్లో అతను ప్యూర్ బ్యాటర్‌గా ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్‌లో ఒకరు లక్నో కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.