AUS vs IND: నమ్మకం లేనట్టే కనిపిస్తుంది: తుది జట్టులో స్థానంపై సందేహం వ్యక్తం చేసిన రాహుల్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో  జైశ్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ భారత జట్టు ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఓపెనర్ గా తనపై ఉంచిన బాధ్యతను రాహుల్ న్యాయం చేశాడు. కఠినంగా ఉన్న తొలి రోజు పిచ్ పై ఎంతో ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ 26 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులు చేసి.. జైశ్వాల్ తో 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్  రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది. వీరిద్దరూ ఆదివారం (డిసెంబర్ 1) ఆసీస్ కుర్రాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్ లో బరిలోకి దిగారు. బ్యాటింగ్ ఆర్డర్ పై భారత్ గందరగోళంగా ఉంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్, గిల్ జట్టులో చేరడంతో పడికల్, జురెల్ బెంచ్ కు పరిమితం కానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ తుది జట్టులో తనకు స్థానం ఉంటుందో లేదో అని సందేహం వ్యక్తం చేశాడు. 

Also Read :- చిక్కుల్లో స్టోక్స్.. ఐసీసీకి కౌంటర్ విసిరిన ఇంగ్లాండ్ కెప్టెన్

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను ప్లేయింగ్ XIలో ఉండాలనుకుంటున్నాను. జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తాను. ప్లేస్ ఏదైనా పరుగులు ఎలా చేయాలి అనే దానిపై నేను దృష్టి పెడతాను. ఇది మానసికంగా కొంచెం సవాలుతో కూడుకున్నది. అదృష్టవశాత్తూ నేను వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. మొదటి 20-25 బంతులు ఎలా ఆడాలో మొదట్లో సమస్యగా ఉందేది. కానీ అన్ని ఫార్మాట్ లలో ఆడిన అనుభవంతో నాకు తేలికైంది". అని రాహుల్ అన్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ తర్వాత గిల్ రావడంతో సర్ఫరాజ్ కోసం రాహుల్ ను తుది జట్టు నుంచి తప్పించారు.