
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఝలక్ ఇచ్చాడు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. తొలి రెండు మ్యాచ్ లకు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అందుబాటులో ఉండడమే లేదని సమాచారం. దీనికి కారణం కూడా లేకపోలేదు. రాహుల్ భార్య అథియా శెట్టి త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బిడ్డ పుట్టిన సమయంలో అతను ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా రాహుల్ తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు.
ఇప్పటికే కెప్టెన్సీ ఆఫర్ తిరస్కరించిన రాహుల్.. ప్రారంభ మ్యాచ్ లకు దూరం కావడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రాహుల్ ను రూ. 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనుభవం ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మీద ఢిల్లీ ఫ్రాంచైజీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడిన కేఎల్ .. కెప్టెన్ గా జట్టును ప్లే ఆఫ్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని లక్నో రిటైన్ చేసుకోకుండా వదిలేసి బిగ్ షాక్ ఇచ్చింది. అంతకముందు పంజాబ్, బెంగళూరు, సన్ రైజర్స్ జట్లకు ఆడిన రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకు రాహుల్ 132 ఐపీఎల్ మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు,37 అర్ధ సెంచరీలతో 4683 పరుగులు చేశాడు. ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 148 పరుగులు చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి రెండు మ్యాచ్‌ల కోసం విశాఖపట్నం వెళ్లనుంది. అంతకముందు ఢిల్లీలో ఒక చిన్న శిక్షణ-కమ్-సిమ్యులేషన్ శిబిరాన్ని ఉంటుంది. అక్షర్, రాహుల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మిచెల్ స్టార్క్ మార్చి 17, 18 తేదీలలో విశాఖపట్నం సమావేశానికి హాజరవుతారు.