ఒకటికి రెండు రెట్లు ఇస్తామంటూ.. రియల్ ఎస్టేట్ సంస్థ ఘరానా మోసం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ గ్రామంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రతినెల ఐదేళ్లపాటు తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఒకటికి రెండు ఇస్తాం, రెండు కు నాలుగు ఇస్తాం అంటూ కేఎంజే ల్యాండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ సంస్థ అమాయకులకు శఠగోపం పెట్టారు. రెండింతల డబ్బులతో పాటు ఇన్సూరెన్స్ చెల్లిస్తామంటూ జనానికి కుచ్చుటోపి పెట్టింది ఆ సంస్థ. ఫలితంగా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు కూలీ నాలీ చేస్తూ పైసా పైసా కూడబెట్టి కేఎంజే సంస్థలో పెట్టుబడులు పెట్టారు.

అయితే ఐదు సంవత్సరాలు పాటు డబ్బులు వసూలు చేసిన ఈ సంస్థ ఇప్పుడు బిచానా ఎత్తేయడంతో పైసా పైసా కూడబెట్టి జమ చేసిన నిరుపేద మహిళలు తమకు న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నారు. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ లో గత11 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కేఎంజే ల్యాండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తమ ఏజెంట్ల ద్వారా మహిళలకు కుచ్చుటోపి పెట్టేందుకు పథకం రచించింది. ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్, విజయవాడ ప్రాంతాల్లో తమ సంస్థ ద్వారా భూములను కొనుగోలు చేసి డెవలప్మెంట్ చేస్తున్నట్లు, ఇందులో ఐదు సంవత్సరాల పాటు నెల నెలా డబ్బులు పెట్టుబడులు పెడితే ఐదేళ్ల తర్వాత పెట్టిన డబ్బులకు రెండింతలు, మూడింతలు చెల్లిస్తామంటూ జనాన్ని నమ్మించారు ఆ సంస్థ ఏజెంట్లు. అంతేకాకుండా పెట్టుబదులు పెట్టిన వారికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ చెల్లిస్తామంటూ జనాన్ని నమ్మించారు.

ఈ నేపథ్యంలో చిన్నగోల్కొండ గ్రామానికి చెందిన కట్ట ప్రమీల తో పాటు కేఎంజే సంస్థకు చెందిన మరికొందరు స్థానిక ఏజెంట్లు 11 ఏళ్ల క్రితం చిన్న గోల్కొండ లోని ఇంటింటికి వెళ్లి జనానికి ఆశలు కల్పించారు. జనాల్లో లేనిపోని ఆశలు కల్పించి నెలనెలా అందిన కాడికి డబ్బులు వసూలు చేశారు. అయితే ఏజెంట్ల మాటలు నిజమని నమ్మిన బాధితులు కొందరు మూడేళ్లు, మరికొందరు ఐదేళ్లపాటు ప్రతి నెలా తమకు చేతనైన కాడికి కేఎంజే సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే నిర్ణీత ఐదేళ్ల గడువు పూర్తి కావడంతో డబ్బుల కోసం బాధితులు ఏజెంట్ల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరగడం మొదలుపెట్టారు. 11 ఏళ్లు దాటినా పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఏజెంట్లను నిలదీయడం మొదలుపెట్టారు. అయితే ఏజెంట్ల నుండి సరైన సమాధానం రాకపోవడంతో కేఎంజే సంస్థలో పెట్టుబడులు పెట్టిన బాధిత మహిళలు చిన్న గోల్కొండ గ్రామంలో మే 15వ తేదీ సోమవారం ఆందోళనకు దిగారు. స్థానిక సర్పంచ్ పద్మావతి తో పాటు చిన్న గోల్కొండ సహకార బ్యాంక్ డైరెక్టర్ చిన్న అనంతరెడ్డి వద్దకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం:- చిన్న గోల్కొండ సర్పంచ్ పద్మావతి అనంతరెడ్డి

కేఎంజే రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులకు అండగా ఉంటామని చిన్న గోల్కొండ సర్పంచ్ గుర్రం పద్మావతి అనంతరెడ్డి హామీ ఇచ్చారు. సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధుల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసి బాధితులకు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.