
UPI Alert: మార్కెట్లో మోసగాళ్లు ఇందుగలను అందులేను అని తేడాలేకుండా అన్నింటికీ నకిలీలను సృష్టిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా నకిలీ యూపీఐ యాప్స్ కూడా ప్రత్యక్షం కావటంపై సైబర్ నిపుణులు ప్రజలు, వ్యాపారులను అలర్ట్ చేస్తున్నారు. మోసగాళ్లు వీటిని చెల్లింపులకు ఉపయోగిస్తున్నారు. ఇవి నిజమైన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ మాదిరిగానే చూడటానికి కనిపిస్తుంటాయి. ప్రధానంగా మోసగాళ్లు వీటిని చిన్న వ్యాపారులు, షాపు యజమానులు, ట్రేడర్లను టార్గెట్ చేస్తూ విరివిగా ఉపయోగిస్తున్నారు.
కొత్తగా తయారుచేస్తున్న ఫేక్ యూపీఐ యాప్స్ రిటైల్ షాపు యజమానులను బురిడీ కొట్టిస్తున్నాయి. ఇది నిజంగా పేమెంట్ జరిగినప్పుడు స్పీకర్ బాక్స్ చేసే సౌండ్లను కూడా సృష్టించటం కొసమెరుపు. వాటిలో తప్పుడు ట్రాన్సాక్షన్ వివరాలు చూపిస్తూ నిజంగానే చెల్లింపు జరిగినట్లు కనిపిస్తుంటుంది. వీటిని చూపించినప్పుడు చాలా మంది వ్యాపారులు జరిగిన మోసం గురించి తెలియక తమ ఖాతాలోకి నిజంగానే డబ్బులు వచ్చాయని భావిస్తున్నారు.
ఫేక్ యూపీఐ యాప్స్ నుంచి జాగ్రత్తగా ఉండటం ఎలా..?
1. ఎవరు పేమెంట్ చేసినా వెంటనే మీ బ్యాంక్ ఖాతా వివరాల్లోకి వెళ్లి డబ్బులు నిజంగానే జమ అయ్యాయో లేదో చెక్ చేసుకుని నిర్థారించుకోండి.
2. కేవలం షాపులోని సౌండ్ బాక్స్ నోటిఫికేషన్ మీద మాత్రమే ఆధారపకుండా, వెంటనే యాప్ లో చెక్ చేసుకోండి.
3. యూపీఐ చెల్లింపు యాప్స్ ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోండి.
4. వినియోగదారులు మీకు కొత్త యాప్స్ నుంచి చెల్లింపులను చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండి, నిజంగానే డబ్బు మీ ఖాతాలోకి జమ అయ్యిందా లేదా అనే అంశాన్ని పరిశీలించుకోండి.
5. ఏదైనా తప్పుడు ట్రాన్సాక్షన్లు లేదా మోసాలను గమనిస్తే వాటి వివరాలను సైబర్ క్రైమ్ నంబర్ 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి.
మోసగాళ్లు రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీని ప్రజలను సులువుగా మోసం చేసేందుకు వినియోగిస్తున్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకోకుండా అప్రమత్తంగా ఉండండి. తెలిసినవారే కథా అని ట్రాన్సాక్షన్స్ జరిపినప్పుడు వాటిని వెరిఫై చేసుకుంటూ అలర్ట్ గా ఉండటం మోసపూరిత యూపీఐ చెల్లింపుల స్కామర్ల చేతిలో చిక్కకుండా ఉంటారు. కొన్ని సార్లు సర్వర్ ఇష్యూ వల్ల డబ్బు ఆగి ఉండొచ్చు అని వారు చెప్పినప్పటికీ మాటలు నమ్మకపోవటం ఉత్తమం. లేదా మీరు వారి ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.