
Improve Credit Score: ఈ రోజుల్లో ఎలాంటి రుణాలను పొందాలన్నా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ముందుగా పరిశీలించేది సదరు వ్యక్తికి సంబంధించి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ రిపోర్టునే. అయితే చాలా మందికి ఎలాంటి రుణ రికార్డులు లేకపోవటం కారణంగా క్రెడిట్ స్కోర్ ఉండదు. అయితే సరైన మార్గాల ద్వారా మీరు క్రెడిట్ స్కోర్ పెంచుకోవటం రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు పొందేలా చేస్తుంది. అయితే 5 సింపుల్ మార్గాల ద్వారా పెట్టుబడిదారులు తమ క్రెడిట్ స్కోర్ ఎలా పెంపొందించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
1. ముందుగా వ్యక్తులు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుంచి సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను పొందటం ద్వారా తమ క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇవి సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరిగానే పనిచేస్తాయి, అయితే బ్యాంకులు మీకు ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేనందున ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకుని దానిపై కార్డును జారీ చేస్తుంటాయి. ఈ కార్డులను సక్రమంగా వినియోగిస్తూ, అందించిన లిమిట్‌లో 30 శాతం కంటే తక్కువ మెుత్తాన్ని వినియోగించటం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగుపరచుకోవచ్చు.
2. ఒకవేళ కుదిరితే మీ యుటిలిటీ బిల్స్, ఇంటి అద్దె, రీచార్జ్ వంటి చెల్లింపులను ఆటోపేలో ఉంచటం మంచిది. అలా క్రమం తప్పకుండా చెల్లింపులు చేపట్టడం ద్వారా దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.
3. క్రెడిట్ స్కోరును వేగంగా బిల్డ్ చేసుకోవటానికి ఉన్న మార్గాల్లో ఒకటి చిన్న రుణాన్ని పొందటం. చిన్న పర్సనల్ లోన్, గోల్డ్ లేన్ వంటివి తీసుకుని వాటికి సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేపట్టడం ద్వారా క్రెడిట్ బ్యూరో సంస్థలు మీ ఆర్థిక క్రమశిక్షణను ట్రాక్ చేస్తాయి. అలా సకాలంలో చెల్లింపులు చేయటాన్ని పరిగణించి మీ స్కోర్ పెంచటంతో పాటు మీ క్రెడిట్ వర్దీనెస్ కూడా మెరుగుపడుతుంది.
4. మీరు క్రెడిట్ స్కోర్ ప్రతినెల సకాలంలో పరిశీలించుకోవటం మంచి అలవాటు. ఒకవేళ అందులో ఏదైనా తప్పులను గమనిస్తే వాటిని వెంటనే క్రెడిట్ బ్యూరో సంస్థకు నివేదించటం ద్వారా సరిదిద్దుకోవచ్చు. మీరు దేశంలో సిబిల్, ఈక్విఫ్యాక్స్, సీఆర్ఐఎఫ్, ఎక్స్ పీరియన్ వంటి సంస్థలు అందించే ఉచిత క్రెడిట్ రిపోర్టులను గమనించవచ్చు.
5. ఎంత ఎక్కువ క్రెడిట్ హిస్టరీ కలిగి ఉంటే అంత మంచిది. అందుకే పాత బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు వంటి వాటిని కొనసాగించటం ఉత్తమం. మీరు వీటిని క్లోజ్ చేయటం వల్ల ఆర్థిక చరిత్ర తగ్గుతుంది. ఇది ప్రతికూలంగా మీ క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసే ప్రమాతం ఉంటుంది. అందుకే పాత ఖాతాలను యాక్టివ్‌లో ఉంచటం మంచిది.
మెుత్తానికి 750 కంటే ఎక్కువ పాయింట్లు క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం మెరుగైనదిగా పరిగణించబడుతుంది. ఇలా మంచి స్కోర్ కలిగి ఉండే వ్యక్తులకు రుణాలు వేగంగా, సరసమైన వడ్డీ రేట్లకు అందించేందుకు ఆర్థిక సంస్థలు ముందుకు వస్తాయి. అందుకే క్రెడిట్ స్కోర్ నేటి కాలంలో చాలా ముఖ్యమైనదిగా మారిపోయింది.