Income Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి 8 మార్పులు..

Income Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి 8 మార్పులు..

Income Tax Changes: నేటితో మార్చి నెల ముగిసిపోతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్నందున పన్ను చెల్లింపుదారులు గమనించాల్సిన అనేక మార్పులు ఇక్కడ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సమయంలో ప్రకటించిన కీలక మార్పులు అమలులోకి వస్తున్నందున వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఏవేవి మార్పులు వస్తున్నాయో తప్పనిసరిగా తెలుసుకోవటం ముఖ్యం. 

ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025లో వేతన జీవులకు భారీ ఊరటను ప్రకటించారు. న్యూటాక్స్ రీజిమ్ కింద పన్ను రహిత ఆదాయ పరిమితిని ఆర్థిక సంత్సరంలో రూ.7 లక్షల పరిమితిని ఆమె ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ పెద్ద ప్రకటన చేశారు. ఆర్థిక వ్యవస్థలో డబ్బు లభ్యతను పెంచటం లక్ష్యంగా ప్రజల చేతిలో ఖర్చుచేసేందుకు ఎక్కువ డబ్బులు ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోబడింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి న్యూటాక్స్ రీజిమ్ కింద కొత్త పన్ను శ్లాబ్ రేట్లను ప్రకటించారు. వాటి వివరాలను గమనిస్తే..

మారిన న్యూటాక్స్ రీజిమ్ శ్లాబ్ రేట్లు..
- 0 నుంచి రూ.4 లక్షల ఆదాయంపై పన్ను సున్నా
- రూ.4 లక్షల ఒక్క రూపాయి నుంచి రూ.8 లక్షల ఆదాయంపై పన్ను 5 శాతం
- రూ.8 లక్షల ఒక్క రూపాయి నుంచి రూ.12 లక్షల ఆదాయంపై పన్ను 10 శాతం
- రూ.12 లక్షల ఒక్క రూపాయి నుంచి రూ.16 లక్షల ఆదాయంపై పన్ను 15 శాతం
- రూ.16 లక్షల ఒక్క రూపాయి నుంచి రూ.20 లక్షల ఆదాయంపై పన్ను 20 శాతం
- చివరిగా రూ.24 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను రేటు నిర్ణయించబడింది

సెక్షన్ 87 A కింద పన్ను రాయితీ
న్యూటాక్స్ రీజిమి కింద.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A పన్ను రాయితీని రూ.25,000 నుంచి రూ.60,000 పెంచబడింది. అలాగే జీతం పొందే వ్యక్తులకు ఈ మినహాయింపు రూ.75 వేలతో మెుత్తం పన్ను రహిత ఆదాయం రూ.12 లక్షల 75 వేలకు చేరుకుంది. అయితే పాత పన్ను విధానంలో మాత్రం రాయితీ విషయంలో ఎలాంటి మార్పులు ప్రతిపాదించబడలేదు. 

* ఏప్రిల్ 1 నుంచి టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్(TDS) పరిమితులు కూడా పెంచబడతున్నాయి. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై TDS పరిమితి గతంలో రూ.50,000 నుంచి ప్రస్తుతం రూ.1 లక్షకు పెరుగుతోంది. 

►ALSO READ | Gold Rate: ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన గోల్డ్.. నేడు రూ.7వేల 100 అప్, హైదరాబాదులో రేట్లివే..

* అలాగే ఏప్రిల్ 1 నుంచి టాక్స్ కలక్షన్ ఎట్ సోర్స్(TCS) రేట్లు మారుతున్నాయి. గతంలో టీసీఎస్ రూ.7 లక్షలకు పైగా ఉన్న మెుత్తాలపై వర్తించేది, కానీ ఇప్పుడు దీని పరిమితి రూ.10 లక్షలకు పెంచబడింది. దీని ప్రభావం ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రయాణం వంటి లావాదేవీలపై ఉండనుంది. 

* అప్ డేట్ చేయబడిన ఐటీఆర్ ఫైల్ చేయటానికి కాల పరిమితిని గతంలో 12 నెలలుగా ఉండగా ప్రస్తుతం దానిని 48 నెలలు అంటే 4 ఏళ్లకు పొడిగించబడింది. అంటే ప్రస్తుతం ఎవరైనా ఏదైనా కారణాలతో రిటర్న్ పూర్తి కాకుంటే దానిని నాలుగేళ్లలో రివైజ్ చేసేందుకు అనమతించబడతారు. 

* మారిన పన్ను రూల్స్ ప్రకారం ఇకపై ఏప్రిల్ 1, 2030కి ముందు దేశంలో రిజిస్టర్ చేయబడే స్టార్టప్ కంపెనీలు అవి పొందే లాభాలపై పరిమితులకు లోబడి వరసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు సెక్షన్ 80-IAC కింద 100 శాతం మినహాయింపును పొందవచ్చు. 

* ఇక చివరిగా ఏప్రిల్ 1, 2025 నుంచి ఆదాయపు పన్ను చట్టం 1961 నుంచి సెక్షన్ 206AB, సెక్షన్ 206CCAలు తొలగించబడుతున్నాయి. ఇది పన్ను కలక్టర్లు, డిడక్టర్లకు భారాన్ని తగ్గించనుంది.