
Home Loans: ఇవాళ రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లలో తగ్గింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది హోమ్ లోన్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా మంది లోన్ కోసం ప్రయత్నించటానికి ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అయితే సరైన సిబిల్ స్కోర్ వల్ల లక్షల్లో డబ్బును ఎలా సేవ్ చేయెుచ్చనే విషయాన్ని ఇక్కడ ముందుగా తెలుసుకోండి.
వ్యక్తులు హోమ్ లోన్ కోసం ఏదైనా బ్యాంకును లేదా ఆర్థిక సంస్థను సంప్రదించినప్పుడు వాళ్లు ముందుగా పరిశీలించేది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. దీని ద్వారా రుణగ్రహీత క్రెడిట్ వర్తీనెల్, అతని ఆర్థిక చరిత్ర ద్వారా చెల్లింపుల ట్రాక్ రికార్డ్, ఆర్థిక క్రమశిక్షణ వంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. దీని ద్వారా సదరు వ్యక్తికి లోన్ ఇవ్వాలా వద్దా లేకపోతే ఎంత వడ్డీకి లోన్ ఇవ్వాలి వంటి అంశాలను ఆర్థిక సంస్థలు, బ్యాంకులు నిర్ణయించుకుంటాయి. ఇతర రుణాల విషయంలో కూడా ఇదే ఫార్ములాను వారు ఉపయోగిస్తారు.
అందువల్ల మంచి సిబిల్ ఉన్న వ్యక్తులకు బ్యాంక్ తక్కువ రిస్క్ కలిగిన వ్యక్తుల కేటగిరీలో సరసమైన వడ్డీకి లోన్ ఆఫర్ చేస్తాయి. తద్వారా వ్యక్తులకు హోమ్ లోన్ నెలవారీ ఈఎంఐలో వడ్డీ భారం తగ్గుతుంది. అందువల్ల వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణతో తమ క్రెడిట్ కార్డు బిల్లులు, కన్జూమర్ లోన్ చెల్లింపులు, పర్సనల్ లోన్ చెల్లింపులు సమయానికి మిస్ కాకుండా చేయాల్సి ఉంటుంది. వీటి చెల్లింపుల రికార్డు ద్వారా రుణం ఇవ్వటం ఎంతవరకు సేఫ్ అనే అంశాలను కూడా ఆర్థిక సంస్థలు అంచనా వేస్తుంటాయని రుణగ్రహీతలు తెలుసుకోవాలి.
Also Read:-డొమెస్టిక్ సిలిండర్ల రేటు మెట్రో నగరాల్లోనే టాప్.. మనకే ఎందుకట్ల?
వాస్తవానికి దేశంలో ఈక్విఫ్యాక్స్, సిబిల్, ఎక్స్ పీరియన్, సీఆర్ఐఎఫ్ వంటి సంస్థలు ప్రజల ఆర్థిక చరిత్రకు అనుగుణంగా రేటింగ్ ఇస్తుంటాయి. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇక్కడ 800 పాయింట్ల కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండే వ్యక్తులకు హోమ్ లోన్ తక్కువ రేటుకు అందుతుంది. ఉదాహరణకు వీరికి యూనియన్ బ్యాంక్ 8.1 శాతానికి లోన్ అందిస్తోంది. అలాగే 700-749 మధ్య స్కోర్ ఉండే వ్యక్తులకు రుణం 8.85 శాతానికి లభిస్తోంది. 650 పాయింట్ల కంటే దిగువన రేటింగ్ ఉంటే 10 శాతం ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు 8.1 శాతం వడ్డీ రేటుతో (క్రెడిట్ స్కోర్: 800) 25 సంవత్సరాల కాలానికి రూ.50 లక్షల రుణం తీసుకుంటే.. నెలకు చెల్లించాల్సిన EMI సుమారు రూ.38వేల 923 అవుతుంది. దీనికింద మెుత్తం వడ్డీ చెల్లింపులు రూ.66.76 లక్షలవుతుంది. అయితే సిబిల్ 800 పాయింట్ల కంటే తక్కువ ఉన్న రుణగ్రహీత 8.85 వడ్డీ రేటుకు ఇదే రుణాన్ని పొందితే నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.41వేల 618 అవుతుంది. దీంతో చెల్లించాల్సిన వడ్డీ మెుత్తం పెరిగి రూ.74.85 లక్షలకు చేరుకుంటుంది. అంటే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే అధిక వడ్డీ రేట్ల వల్ల లక్షల్లో నష్టాన్ని చూస్తున్నారు. అందుకే ఎల్లప్పుడూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సమయానికి చెల్లింపులు చేయటం, ఎక్కువగా రుణాలపై ఆధారపడకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది హోమ్ లోన్ విషయంలో లక్షల్లో వడ్డీ భారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.