April 1st Rules: కొత్త నెల నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే.. జేబులకు చిల్లు..

April 1st Rules: కొత్త నెల నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే..  జేబులకు చిల్లు..

Rules Changing From April 1st: ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ నెల మెుదటిరోజు నుంచి కూడా కొన్ని అంశాలకు చెందిన రూల్స్ మారిపోతున్నాయి. గ్యాస్ ధరల నుంచి యూపీఐ, బ్యాంకింగ్ వరకు అనేక అంశాలకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం పౌరులు తప్పక తెలుసుకోవాలి. ఈ మార్పులు వారి జేబులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశాన్ని కూడా గ్రహించటం చాలా ముఖ్యం.

యూపీఐ రూల్స్..
ముందుగా ఏప్రిల్ 1, 2025 నుంచి యూపీఐ చెల్లింపుదారులకు ఒక షాకింగ్ వార్త ఉంది. అదేంటంటే గడచిన 12 నెలల కాలం నుంచి వినియోగంలో లేని యూపీఐ ఐడీలను బ్యాంకింగ్ సంస్థలు తొలగించనున్నాయి. ఇలా చేయటం ద్వారా నిరుపయోగంగా విడిచిపెట్టిన ఐడీలను స్కామర్లు తమ స్వర్థ ప్రయోజనాల కోసం వినియోగించుకోకుండా ఉంటారు. ఇది ప్రజలకు సంబంధం లేకుండా జరిగే మోసాలను అరికట్టడంలో భద్రతను కూడా అందిస్తుంది. ఒకవేళ కావాలనుకుంటే యూజర్లు తమ డార్మెట్ యూపీఐ ఐడీని రీయాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను మార్పులు..
రానున్న నెల నుంచి ఆదాయపు పన్ను చట్ట ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో న్యూ టాక్స్ రీజిమ్ కింద ఆర్థిక మంత్రి ఈసారి బడ్జెట్లో అందించిన పన్ను రహిత ఆదాయ పరిమితి పెంపు, సదరు స్లాబ్ రేట్లు అమలులోకి వస్తాయి.  ఈ క్రమంలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ చేయబడదినందున పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80సి, 80డి కింద ప్రయోజనాలు పొందాలంటే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

డివిడెండ్ చెల్లింపు రూల్స్..
వాస్తవానికి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు వారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు డివిడెండ్ రూపంలో వచ్చిన లాభాలను కొంత పంచిపెడుతుంటాయి. అయితే ఇకపై ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయని వ్యక్తులకు డివిడెండ్ పొందటం కష్టతరంగా మారనుంది. ఈ ఆదాయంపై టీడీఎస్ కట్ చేయటంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. పైగా రిఫండ్ క్లెయిమ్ చేయటం వల్ల ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆధార్-పాన్ లింకింగ్ పూర్తి చేయటం ఉత్తమం.

ALSO READ | IT News: అమెరికన్లను వణికిస్తున్న ఏఐ టూల్.. ఇప్పుడు టార్గెట్ భారత ఐటీ ఉద్యోగులే..!
.
గ్యాస్ సిలిండర్ ధరల మార్పు..
ప్రతినెల మాదిరిగానే దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీల యాజమాన్యాలు ఏప్రిల్ 1న కూడా డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరల్లో మార్పులను ప్రకటించవచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సిలిండర్లను అందుకోవటానికి గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనున్నందున ప్రజలు దీనిని తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు. 

డీమ్యాట్ ఖాతాలు..
కొత్త నెల ప్రారంభం నుంచి ప్రజలు డీమ్యాట్ ఖాతాలను తెరవటం లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినంగా మారిపోనున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులు తమ పెట్టుబడి ఖాతాలకు సంబంధించిన కేవైసీ ప్రక్రియను పూర్తి చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పెట్టుబడులను కొనసాగించవచ్చని గుర్తుంచుకోవాలి. ఇవి పట్టించుకోకపోతే సదరు పెట్టుబడిదారుని ఖాతా ఫ్రీజ్ అయ్యే ప్రమాదం కూడా ఉందని గ్రహించాలి.