న్యూఢిల్లీ : ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్డీఐ) ఇటీవల ఆరోగ్య బీమా రంగంలో కొన్ని పెద్ద మార్పులను తీసుకొచ్చింది. పాలసీదారులకు మరింత మేలు చేసేందుకు అనేక కీలక నియమాలను, మార్పులను ప్రవేశపెట్టింది. వీటిలో బీమాకు సంబంధించిన అన్ని వివరాలను సులభంగా తెలియజేయడం, నో- క్లెయిమ్ బోనస్‌ను అందించే విధానాలను పేర్కొనడం, క్లెయిమ్- సెటిల్‌మెంట్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా చేయడం వంటివి ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం.
1. గతంలో క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి పాలసీ రెన్యువల్ చేయబోమని కంపెనీలు చెప్పడం కుదరదు. ఫ్రెష్ అండర్ రైటింగ్ నిర్వహించడం కూడా సాధ్యం కాదు. అంటే మళ్లీ ఆరోగ్య పరీక్షలు చేయడం, నిబంధనలు మార్చడం కుదరదు.
2. బీమా కంపెనీలు ఇక నుంచి 30 రోజులలోపు బీమా అంబుడ్స్‌మన్ ఆదేశాలను అమలు చేయాలి. లేకపోతే జరిమానా, వడ్డీ పడతాయి. నిర్ణీత గడువులోపు అంబుడ్స్‌మన్ అవార్డులను అమలు చేయకపోతే బీమాదారులు పాలసీదారునికి రోజుకు రూ.5,000 చొప్పున చెల్లించాలి.
3. అన్ని వయసుల వారికి, ముందే వివిధ వ్యాధులు గల వ్యక్తులకు, వికలాంగులకు.. అందరికీ అందించే ఉత్పత్తులను బీమా సంస్థలు అందించాలి. పాలసీలు తప్పనిసరిగా ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపీడీ), డేకేర్ ట్రీట్‌మెంట్, హోమ్ కేర్ ట్రీట్‌మెంట్‌ను కవర్ చేయాలి. అన్ని అధునాతన ఆపరేషన్లను కూడా కవరేజీలో చేర్చాలి.
4. దరఖాస్తు చేసిన ఒక గంటలోపు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ రిక్వెస్టులపై నిర్ణయం చెప్పాలి. ఇప్పటివరకు ఇలాంటి విధానం లేదు. ఒక్కో కంపెనీ ఒక్కో విధానాన్ని పాటిస్తోంది. దీనివల్ల రోగులు ఇబ్బందిపడాల్సి వస్తోంది.
5. బిల్లులను తీసుకున్న 3 గంటలలోపు డిశ్చార్జ్‌కు ఆమోదం తెలపాలి. ఇంతకు మించి ఏదైనా ఆలస్యం జరిగితే, ఆసుపత్రి ద్వారా వసూలు చేసే ఏదైనా అదనపు మొత్తాన్ని కంపెనీయే భరించాలి.
6. పాలసీలోని ముఖ్యమైన నిబంధనలను, షరతులను సరళమైన భాషలో వివరించే కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్‌ను వినియోగదారులకు అందించాలి. పాలసీదారులు తమ బీమా కవరేజీని సులభంగా అర్థం చేసుకునేలా చేయాలి.
7. క్లెయిమ్‌ను ఒకే వ్యక్తి తిరస్కరించడం కుదరదు. కమిటీలోని ముగ్గురు -సభ్యుల కమిటీ తప్పనిసరిగా సమీక్షించాలి. ఈ మార్పు పారదర్శకతను పెంచుతుంది.
8. అరవై నెలల నిరంతర కవరేజ్ తర్వాత, బీమా సంస్థలు ఏకపక్ష కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించడాన్ని నిషేధించారు. పాలసీదారు మోసం చేశాడని నిరూపించగలిగితే మాత్రమే వారు క్లెయిమ్‌లను తిరస్కరించవచ్చు.
9. మోటారు బీమాలో, మీరు క్లెయిమ్ చేయకుంటే, మీ తదుపరి సంవత్సరం ప్రీమియం తగ్గుతుంది. ఆరోగ్య బీమాను క్లెయిమ్ చేసుకోని వాళ్లు ఇక నుంచి తక్కువ ప్రీమియం లేదా ఎక్కువ కవరేజీ... రెండింట్లో ఒకదానిని ఎంచుకోవచ్చు.
10. పాలసీదారులు ఇక నుంచి తమ బీమా సంస్థకు 7 రోజుల నోటీసును అందించడం ద్వారా వారి ఆరోగ్య బీమాను రద్దు చేసుకోవచ్చు. క్లెయిమ్‌లు చేయనట్లయితే, బీమా సంస్థ మిగిలిన పాలసీ వ్యవధి కోసం ప్రీమియంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తుంది.