
New Passport Rule: దేశంలో చాలా మంది ప్రజలు పాస్‌పోర్టులు కలోగి ఉన్నారు. ఇది వారికి విమాన ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు భారతీయులు తమ గుర్తింపుగా ప్రభుత్వం అందించే పాస్‌పోర్ట్ ను అధికారికంగా వినియోగిస్తుంటారు. అయితే తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొత్త పాస్‌పోర్ట్ అప్‌డేట్ ప్రకటించటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం ఇకపై పౌరులు తమ మ్యారేజ్ సర్టిఫికెట్ అందించాల్సిన అవసరం లేకుండానే జీవిత భాగస్వామి పేరును పాస్‌పోర్ట్‌లో యాడ్ చేయవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. కొత్త నియమం కింద జీవిత భాగస్వామితో కూడిన ఫొటోను డిక్లరేషన్ రూపంలో అందించాల్సి ఉంటుందని వెల్లడించింది.
అంటే ఇకపై భార్యాభర్తలిద్దరూ సంతకం చేసిన అనెక్చర్ J, ఇప్పుడు సాంప్రదాయ వివాహ ధృవీకరణ పత్రం అవసరానికి చెల్లుబాటు అయ్యే ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పూణే ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి అర్జున్ డియోర్ వెల్లడించారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పద్ధతుల్లో గణనీయమైన ప్రాంతీయ అసమానతలను ఈ మార్పు పరిష్కరిస్తుందని సీనియర్ పాస్‌పోర్ట్ అధికారి అన్నారు. మహారాష్ట్రలో వివాహాలు సాధారణంగా డిఫాల్ట్‌గా నమోదు చేయబడతాయి, అయితే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఉండదు. దీనివల్ల దరఖాస్తుదారులు అధికారిక వివాహ ధృవీకరణ పత్రాలు లేక పాస్‌పోర్టు పొందే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది దరఖాస్తుదారులకు తరచుగా పూర్తి డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ ఫోటో డిక్లరేషన్ ఎంపికను ప్రవేశపెట్టిందని సదరు అధికారి వెల్లడించారు.
అనెక్చర్ జే కింద దంపతులు తమ పేర్లు, చిరునామా, వైవాహిక స్థితిని ప్రకటించాల్సి ఉంటుంది. ఇది వారు వివాహం చేసుకున్న జంటగా కలిసి నివసిస్తున్నారని పరిగణిస్తుంది. ఈ ఫారమ్‌లో స్వీయ-ధృవీకరించబడిన ఉమ్మడి ఫోటోగ్రాఫ్ కోసం స్థలం, తేదీతో డిక్లరేషన్‌పై సంతకం చేయాలి. అదనపు అవసరమైన వివరాల్లో భార్యాభర్తలిద్దరికీ ఆధార్ నంబర్లు, ఓటరు ఐడీ వివరాలు సమర్పించాలి. అక్కడ అడిగిన అన్ని వివరాలు అందిస్తేనే ఫారమ్ చెల్లుబాటు అవుతుంది.
అయితే ఇదే క్రమంలో పాస్‌పోర్ట్ నుంచి జీవిత భాగస్వామి పేరును తొలగించడానికి, విడాకుల డిక్రీ లేదా ఆర్డర్ ఇప్పటికీ తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్‌లో జీవిత భాగస్వామి పేరును మార్చడానికి, దరఖాస్తుదారులు విడాకుల డిక్రీ, మొదటి జీవిత భాగస్వామి మరణ ధృవీకరణ పత్రం, తిరిగి వివాహ ధృవీకరణ పత్రం లేదా రెండు పార్టీలు సంతకం చేసిన జాయింట్ ఫోటో డిక్లరేషన్‌తో పాటు QR-కోడ్-ఎనేబుల్డ్ ఆధార్ ధృవీకరణను కలిగి ఉన్న నవీకరించబడిన గుర్తింపు పత్రాలను అందించాల్సి ఉంటుందని వెల్లడైంది.