Bank Rules: నేటి నుంచి మారిన యూపీఐ, మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఇవే..

Bank Rules: నేటి నుంచి మారిన యూపీఐ, మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఇవే..

UPI Rule Change: ప్రతి నెల మాదిరిగానే ఈనెల మెుదటి తేదీ నుంచి అనేక ఆర్థిక అంశాలకు సంబంధించిన కీలక మార్పులు నేడు అమలులోకి వస్తున్నాయి. అయితే ఇవి ప్రజల ఆర్థిక అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని ప్రస్తుతం మనం గమనిద్దాం.

ముందుగా యూపీఐ చెల్లింపుదారుల భద్రత, రక్షణ కోసం తీసుకురాబడిన మార్పుల గురించి తెలుసుకుందాం. యూపీఐ వ్యవస్థను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల విషయంలో కీలక మార్పులను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం డీయాక్టివేట్ అయిన మెుబైల్ నంబర్లకు లింక్ చేయబడిన యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేసే రూల్స్ అమలులోకి వస్తున్నాయి. అలాగే యూపీఐ లావాదేవీల కోసం చాలా కాలంగా తమ మొబైల్ నంబర్‌ను ఉపయోగించని వినియోగదారులు, యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఏప్రిల్ 1 లోపు తమ బ్యాంకు వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించింది.

భద్రతను పెంచటంతో పాటు యూపీఐ ఐడీల అక్రమ వినియోగాన్ని నివారించటానికి బ్యాంకుతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్-పార్టీ యూపీఐ ప్రొవైడర్లు వినియోగం లేని నంబర్‌లను దశలవారీగా తొలగించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆదేశించింది.

ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా అనేక బ్యాంకులు తమ కస్టమర్లకు సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో కనీసం నిల్వ చేయాల్సిన బ్యాలెన్స్ పరిమితులను ఏప్రిల్ 1 నుంచి మార్చుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి సంస్థలు మార్పులను చేపడుతున్నాయి. వీటిని పాటించని ఖాతాదారుల నుంచి మిలిమం బ్యాలెన్స్ కలిగిలేనందుకు పెనాల్టీలు వసూలు చేస్తాయి. 

అలాగే ఏటీఎం లావాదేవీల రుసుములకు సంబంధించిన మార్గదర్శకాలను రిజర్వు బ్యాంక్ మార్పులు చేపట్టింది. అంటే ఉచిత పరిమితి, ప్రతి లావాదేవీకి గరిష్టంగా అనుమతించదగిన ఛార్జ్ మార్పులు జరిగాయి. దీనికి అనుగుణంగా దేశంలోని బ్యాంకులు నెలకు అనుమతించే ఉచిత ఏటీఎం ఉపసంహరణల సంఖ్యను తగ్గించాయి. ముఖ్యంగా ఇప్పుడు వినియోగదారులు ఇతర బ్యాంకు ATMలలో ప్రతి నెలా మూడు ఉచిత ఉపసంహరణలను మాత్రమే అనుమతిస్తారు. ఈ లిమిట్ దాటి చేసే ట్రాన్సాక్షన్లకు లావాదేవీకి రూ.20 నుంచి రూ.25 వరకు రుసుముగా ఉండనుంది.