
Sensex-Nifty: వరుసగా గడచిన కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. వాస్తవానికి ఇంట్రాడేలో నేడు బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల మేర లాభాలు ఆవిరి కావటంతో చివరికి పెద్దగా లాభాలు లేకుండా స్థిరపడ్డాయి. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
నేడు మార్కెట్ల ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీల లాభాలు మధ్యాహ్నం నాటికి ఆవిరి కావటానికి కీలక కారణాలను పరిశీలిస్తే.. ముందుగా గడచిన 6 ట్రేడింగ్ సెషన్ల నుంచి వస్తున్న లాభాలను ఇన్వెస్టర్లు బుక్ చేసుకోవటానికి నేడు ప్రయత్నించటం కనిపించిందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో ఆటో మెుబైల్ దిగుమతులపై సుంకాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఇచ్చిన సంకేతాలు భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో పెట్టుబడిదారులు కొంత అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
ALSO READ | ఆన్‌లైన్ యాడ్స్‌పై తొలగనున్న డిజిటల్ ట్యాక్స్
నేడు మార్కెట్లలో ఫార్మా రంగానికి చెందిన కంపెనీల షేర్లు సైతం భారీగానే ప్రభావితం అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 ను 'అమెరికా ఆర్థిక వ్యవస్థకు విముక్తి దినోత్సవం'గా పేర్కొంటూ సుంకాల బెదిరింపులపై చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు భారీగా ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఇండియా కంపెనీలపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో ఫార్మా రంగానికి చెందిన అనేక కంపెనీల షేర్లను విక్రయించటానికి మార్కెట్లో ఇన్వెస్టర్లు మెుగ్గుచూపారు. ఇదే సమయంలో అల్యూమినియంపై కూడా అమెరికా టారిఫ్స్ విధిస్తుందని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ALSO READ | Multibagger: లక్ష ఇన్వెస్ట్ చేసినోళ్లను కోటీశ్వరులుగా మార్చేసిన స్టాక్.. మీరూ కొన్నారా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పర సుంకాలకు దిగిన వేళ భారత్ అమెరికాతో ప్రస్తుతం వాణిజ్య చర్చలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే పారిశ్రామిక సుంకాలను భారత్ 10.66 శాతం మేర తగ్గించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది. రెండు దేశాలు మార్కెట్ యాక్సెస్‌ను పెంచడం, సుంకం, నాన్-టారిఫ్ అడ్డంకులను తగ్గించడం, సరఫరా గొలుసు ఏకీకరణను మెరుగుపరచడం, ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది భారత్ ప్రస్తుతం. అలాగే నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ రంగానికి చెందిన షేర్లు మంచి పనితీరుతో వెన్నుదన్నుగా నిలవటం గమనార్హం. అలాగే మరింతగా సుంకాలను తగ్గించటానికి, రాయితీలను అందించటానికి ఉన్న అవకాశాలను భారత్ పరిశీలిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ALSO READ | Upper Circuit: ప్రముఖ ఇన్వెస్టర్ కొన్న స్టాక్.. ఎగబడుతున్న రిటైలర్స్, 20 శాతం అప్..
మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 10 పాయింట్ల మేర లాభాన్ని చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 97 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 554 పాయింట్ల మేర పతనాన్ని నమోదు చేసింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.