
US Trade Tariffs: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన తాజా టారిఫ్స్ ప్రకటన ద్వారా ఉలిక్కిపడేలా చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రకటించిన సుంకాల జాబితాలో రష్యా, కెనడా, ఉత్తర కొరియా దేశాల పేర్లు లేకపోవటమే. అమెరికాను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లూటీ చేశాయని, దోచుకున్నాయని, అత్యాచారం చేశాయంటూ ట్రంప్ తన పరస్పర సుంకాల ప్రకటన సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ట్రంప్ తన కొత్త పరస్పర సుంకాల ప్రకటన జాబితా నుంచి రష్యా, మెక్సికో, కెనడా, ఉత్తర కొరియా వంటి దేశాలను పక్కన పెట్టారు. అమెరికాకు ప్రస్తుతం కెనడా, మెక్సికోలు కీలక వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పటికే ఈ రెండు దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలు అమలులోకి ఉన్నాయి. కెనడియన్ ఇంధనం, పొటాష్‌పై అమెరికా 10 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. మెుత్తం మీద బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే మెక్సికో, కెనడాలపై 25 శాతం పన్నుతో ట్రంప్ తన వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. అలాగే అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందం ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించే వస్తువులకు మినహాయింపు కొనసాగుతోంది.
పుతిన్-కిమ్ లకు రిలీఫ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన లిబరేషన్ డే సుంకాల జాబితాలో రష్యా, ఉత్తర కొరియా, క్యూబా, బెలారెస్ దేశాల పేర్లు కనిపించలేదు. దీనికి కారణం సదరు దేశాలు ఇప్పటికే వాణిజ్య ఆంక్షలను ఎదుర్కోవటమేనని వైట్ హౌస్ ప్రకటించింది. పైగా ఉత్తర కొరియా అధ్యక్షుడు తన అణ్వాయుధ శక్తి, క్షిపణి శక్తులను రోజురోజుకూ పెంచుకోవటం అమెరికాకు మింగుడుపడటం లేదు. కానీ కిమ్ మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అందుకు సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ఎక్కువగా సొంత దేశంలో లభించే వస్తువులపై ఆధారపడే దేశం కావటంతో ట్రంప్ టారిఫ్స్ లాంటి పరిస్థితులు పెద్దగా ప్రభావం చూపబోవని నిపుణులు చెబుతున్నారు.
►ALSO READ | చైనా కోరలు పీకిన ట్రంప్ టారిఫ్స్ : ఇండియా ఎగుమతిదారుల ఖుషీ ఖుషీ..
ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షల వల్ల అమెరికా రష్యాల మధ్య వ్యాపారం దారుణంగా పడిపోయింది. 2024లో అమెరికాతో 295 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును నమోదు చేసిన చైనా ప్రస్తుతం 34 శాతం టారిఫ్‌తో దెబ్బతింది. అలాగే అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలతో ఆసియా దేశాలు అధిక వాణిజ్య లోటును కలిగి ఉండటం కారణంగా ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన పరస్పర పన్నుల జాబితాలో ఎక్కువగా ఉండటం సమహజమైనదిగా నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ట్రంప్ జపాన్, వియత్నాం దేశాలపై ఎక్కువ టారిఫ్స్ విధించటం అత్యంత ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించబడుతోంది.