గవర్నమెంట్​ నెంబర్లు తెలుసుకోవడం ఇక ఈజీ

గవర్నమెంట్​ నెంబర్లు  తెలుసుకోవడం ఇక ఈజీ

న్యూఢిల్లీ: జనానికి ప్రభుత్వ సంస్థల, అధికారుల వివరాలను తెలియజేయడానికి ట్రూకాలర్​ తన కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్​లో డిజిటల్​ గవర్నమెంట్ ​డైరెక్టరీని అందుబాటులోకి తెచ్చింది. వెరిఫై అయిన వేలాది ప్రభుత్వ అధికారుల నంబర్లు ఇందులో ఉంటాయి. సంస్థల నంబర్లూ కనిపిస్తాయి. కొందరు మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల పేర్లతో ఫోన్​ చేసి యూజర్లను మోసం చేస్తున్నారు. ఇక నుంచి ఏదైనా నంబర్​ నుంచి ఫోన్​ వచ్చినప్పుడు అది ఎవరు చేశారో స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ అధికారి, సంస్థ నుంచి ఫోన్​ వస్తే ట్రూకాలర్​ యాప్​పచ్చరంగులో నోటిఫికేషన్​ను చూపిస్తుంది. దీనివల్ల కుంభకోణాలు, మోసాలు, స్పామ్ నుంచి యూజర్లు తమను తాము రక్షించుకోవచ్చు.

డిజిటల్ ప్రభుత్వ డైరెక్టరీలో కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సుమారు 23 రాష్ట్రాలలోని హెల్ప్‎లైన్లు,  ప్రభుత్వ ఏజెన్సీలు, రాయబార కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు,  ఇతర కీలక శాఖల నంబర్లు ఉంటాయి. ఈ సమాచారాన్ని నేరుగా ప్రభుత్వ వనరుల నుండి తీసుకున్నట్టు ట్రూకాలర్​ తెలిపింది. దీనివల్ల 24 కోట్ల భారతీయ ట్రూకాలర్ యూజర్లకు మేలు జరుగుతుందని పేర్కొంది. డైరెక్టరీని విస్తరించడానికి ట్రూకాలర్ వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తోంది. తరువాతి దశలో జిల్లా,  మునిసిపల్ స్థాయిలలో నంబర్లను చేర్చనుంది. సమాచారాన్ని షేర్ చేసి డైరెక్టరీలో పెట్టడానికి ప్రతి ప్రభుత్వ ఏజెన్సీకి ఒక సులభమైన విధానాన్ని ఈ సంస్థ రూపొందించింది.