- కోదాడలోని గుడిబండ లబ్ధిదారుల ఆవేదన
- ఖాళీ బాండ్ పేపర్‌పై సంతకాలు చేయించుకున్నరు
హైదరాబాద్, వెలుగు: దళితబంధు పథకాన్ని వర్తింపజేసేందుకు అధికార పార్టీ నేతలు కమీషన్లు తీసుకున్నారంటూ కోదాడ నియోజకవర్గం గుడిబండకు చెందిన లబ్ధిదారులు ఆరోపించారు. తమతో ఖాళీ బాండ్ పేపర్‌పై సంతకాలు చేయించుకున్నారని 100 మంది లబ్ధిదారులు వాపోయారు. శుక్రవారం వీరిని గాంధీభవన్‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీసుకొచ్చారు. బాధితులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీపీ చింత కవితా రెడ్డి, ఆమె అనుచరులు దళితబంధులో కమీషన్లను దండుకుంటున్నారని, ఖాళీ రూ.100 బాండ్ పేపర్‌పై తమ సంతకాలు చేయించుకున్నారని చెప్పారు.
దళితబంధు పైసల్లో సగం వాటా ఇయ్యకుంటే బాండ్ పేపర్‌పై ఆస్తులు రాయించేసుకుంటామని బెదిరిస్తున్నారన్నారు. పథకం మంజూరుకు ముందే రూ.2 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ‘‘యూనిట్ మంజూరయ్యాక డెయిరీ ఫామ్‌ను ఎంచుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు తీసుకెళ్లి 8 బర్లను ఇప్పించారు. అందులో సగం వాళ్లే తీసుకున్నారు. డబ్బులు పడే బ్యాంక్ అకౌంట్ బుక్కులను వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. దాణా కోసం పడిన పైసలనూ లాగేసుకున్నారు. బ్యాంకుకు స్టేట్మెంట్ తీసుకున్న రోజే దాణా పైసల్ని డ్రా చేసుకున్నారు” అని బాధితులు ఆవేదన చెందారు.
ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులు
అధికార పార్టీ నేతల అక్రమాలపై నిలదీసిన వారిని కులం పేరుతో తిడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న యువకులకు జాబ్ రాకుండా చేస్తామని, పోలీసులతో కేసు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.