
గన్నవరం పరిణమాలపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే గన్నవరం ఘటనపై ఈనాడులో దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
పట్టాభిని గన్నవరం ఎవరు పంపారు
పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారని కొడాలి నాని ప్రశ్నించారు. గన్నవరంలో పట్టాభి రెచ్చగొట్టేలా మాట్లాడి..డ్రామా చేశారని మండిపడ్డారు. క్రరలు, రాళ్లతో దాడి చేసి సీఐ తల పగులగొట్టారని తెలిపారు. పథకం ప్రకారం దాడి చేసి సీఐని కొడితే కేసు పెట్టరా అని నిలదీశారు. సీఐ తలకు తొమ్మిది కుట్లు పడి ఐసీయూలో ఉన్నారని గుర్తు చేశారు. పోలీసులకు కులమతాలు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టాభిని కొట్టారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలో క్రరలు, రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు. రాష్ట్ర సంపదను దుష్ట చతుష్టయం దోచుకుందని విమర్శించారు.
రామోజీ, చంద్రబాబు కుట్ర మేరకే ఈనాడులో దుష్ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. అసత్యాలను సత్యాలుగా నమ్మించాలనేదే రామోజీ కుట్ర అన్నారు. రామోజీ తాను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారని, గతంలోనూ ఎన్టీఆర్‌పై రామోజీ కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఎన్టీఆర్‌పై దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. రామోజీ లాంటివాళ్లను ఆనాడు ఎన్టీఆరే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు గన్నవరం ఘటనకు సంబంధించి తప్పుడు వార్తలు రాసినట్లే ఆనాడు ఎన్టీఆర్‌పై పేజీల మీద పేజీలు వ్యతిరేకంగా వార్తలు రాశారని తెలిపారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయించిన ఘనుడు రామోజీ అని విమర్శించారు. మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవడానికే కుట్రలు పన్నుతున్నారు. మూడేళ్ల కిందటి ఫోటోలు ప్రచురించి సాంకేతిక సమస్య అని చెబుతున్నారు. రామోజీ పిచ్చి రాతలు చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని రామోజీ వార్తలు రాయాలని హితవు పలికారు. ఇప్పటికైనా రామోజీ బుద్ధి తెచ్చుకొని సరైన ఖండన ఇవ్వాలని కొడాలి నాని డిమాండు చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్దపీట
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక భాగం కేటాయించారని తెలిపారు. సీఎం జగన్ సామాజిక విప్లవానికి తెర తీశారని కొనియాడారు. దేశంలోనే ఎవరూ చేయని సాహసాన్ని సీఎం జగన్ చేశారని ప్రశంసించారు. ఎన్టీఆర్, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చింది జగనే అన్నారు. అందుకే చంద్రబాబు, ఎల్లోమీడియా కుట్రలకు తెరలేపారని విమర్శించారు.