
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్లోనే ఉన్న కొడాలి నాని.. ఇవాళ(మార్చి 26, 2025) తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గుండెల్లో నొప్పితో ఆయన బాధపడటంతో హైదరాబాద్ సిటీలోని గచ్చిబౌలి AIG ఆస్పత్రికి ఆయనను హుటాహుటిన తరలించారు.
వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. కొడాలి నానికి గుండెపోటు విషయం తెలిసిన వెంటనే వైసీపీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లో ఉన్న కొందరు కార్యకర్తలు, నేతలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో, డాక్టర్లతో మాట్లాడారు.
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు స్పందించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బందిపడ్డారని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. గుండెపోటు అని మాత్రం వైద్యులు నిర్ధారించకపోవడం గమనార్హం. కొడాలి నాని ఆరోగ్యంపై కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రత్యర్థులు పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.
కొడాలి నానికి క్యాన్సర్ సోకిందని రాజకీయ ప్రత్యర్థులు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు కొన్ని నెలల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత క్యాన్సర్ కాదు అంతుబట్టని రోగంతో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ALSO READ : MP శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షి లాంటివాడు.. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: పేర్ని నాని
కొడాలి నాని రెగ్యులర్ చెకప్ చేయించుకుని రాజకీయంగా యాక్టివ్ కావడంతో అవన్నీ పుకార్లేనని తేలిపోయింది. అయితే.. ఇప్పటి కొడాలి నాని గుండెపోటు వార్తల్లో మాత్రం కొంత నిజం ఉందని, అయితే అది గుండెపోటు కాకపోవచ్చని గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఛాతిలో నొప్పి వచ్చి ఆసుపత్రిలో చేరారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్న మాట.