
యాచారం, వెలుగు: నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో టీఎస్ఐఐసీ బోర్డులు పెట్టడం తగదని, రక్షిత కౌలుదారులకు న్యాయం చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం నజ్దిక్ సింగారం గ్రామంలో రక్షిత కౌలుదారులతో ఆయన మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి రెవెన్యూ గ్రామంలో నజ్దిక్ సింగారం, ఇతర గ్రామాల్లో దాదాపు1,400 ఎకరాల ఓంకారేశ్వర స్వామి భూముల్లో రైతులు రక్షిత కౌలుదారులుగా ఉన్నారని తెలిపారు. ఇటీవల ఆ భూముల్లో టీఎస్ఐఐసీ బోర్డులు పాతారన్నారు. రైతులు సాగు చేస్తున్న భూములపై హక్కులను కల్పించాల్సింది పోయి ప్రభుత్వమే ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బోర్డులు పెట్టి దౌర్జన్యం చేస్తుందని విమర్శించారు. ఇక్కడి కౌలు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో టీజేఎస్ నాయకులు ధార సత్యం, కేవీ రంగారెడ్డి, సామ నిరంజన్న, స్థానిక రైతులు పాల్గొన్నారు.