కేసీఆర్ కు నచ్చని మిలియన్ మార్చ్

కేసీఆర్ కు నచ్చని మిలియన్ మార్చ్

మిలియన్ మార్చ్.. 2011 మార్చి 10న తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటిచెప్పిన చారిత్రక కార్యక్రమం. యావత్ తెలంగాణ  జనం ఏకమై సమైక్యవాద భావనను బద్దలు కొట్టిన సందర్భమది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం కోసం జేఏసీ పిలుపును అందుకుని ట్యాంక్ బండ్పైకి చీమలదండులా.. ఉసిల్ల గుంపులా ప్రజలు దూసుకొచ్చిన దృశ్యాలు పదేళ్లయినా ఇంకా నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అయితే సీమాంధ్రుల పాలనలో ఇనుప కంచెలు, బారికేడ్లు, పోలీస్ నిర్బంధాన్ని దాటుకుని ట్యాంక్ బండ్ చేరుకోగలిగాం కానీ.. ఇప్పుడు ఆ మిలియన్ మార్చ్ను యాది చేసుకుందామని ట్యాంక్ బండ్కు వెళ్లలేని రాక్షస పాలన స్వరాష్ట్రంలో సాగుతోంది.

మిలియన్ మార్చ్ అనే కార్యక్రమం ప్రజల ఆలోచన నుంచే పుట్టింది. నేను ఒకసారి సిరిసిల్లకు పోయినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడుతుండగా.. మీరైతే ఒకసారి చలో హైదరాబాద్ పిలుపునివ్వండి సార్.. మన సత్తా ఏమిటో చూపిద్దామన్నరు. వాళ్లు అంత గట్టిగా చెప్పడంతో ఇలాంటి కార్యక్రమం ఎలాగైనా చేయాలని అనుకున్నం. ఈ క్రమంలోనే ఈజిప్ట్లో తెహ్రీ స్క్వేర్ ముట్టడి జరిగింది. ఈ ఆందోళనతో యావత్ ప్రపంచం ఈజిప్ట్ వైపు చూసింది. తెలంగాణ ఉద్యమానికి కూడా ఈ ఆందోళన స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇలాంటి ముట్టడి ఒకటి మనం కూడా చేయాలని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను యావత్ దేశానికి తెలిసేలా చేయాలని అనుకున్నాం.

సడన్ ప్రకటన.. ఢిల్లీకి వెళ్లొచ్చాక కేసీఆర్ రివర్స్

హైదరాబాద్లో భారీ ముట్టడికి కార్యాచరణపై మేం జేఏసీ సమావేశంలో చర్చిస్తుండగానే కేసీఆర్త్వరలో మిలియన్ మార్చ్నిర్వహించబోతున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. మేమంతా ఆశ్చర్యపోయాం. జేఏసీ తరఫున కాకుండా కేసీఆర్ఏకపక్షంగా ఎలా కార్యక్రమాన్ని ప్రకటిస్తారని ఇతర పక్షాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ఇలా ప్రకటించడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏది చేసినా తెలంగాణ కోసమే కదా అని అన్ని పక్షాలకు నేను నచ్చజెప్పిన. తీరా స్టీరింగ్ కమిటీ ఆ కార్యక్రమానికి ఆమోదం తెలిపాక ఒక రోజు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ.. మిలియన్ మార్చ్ను వాయిదా వేద్దామన్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజల్లో ఉద్యమంపై విశ్వాసం పోతుందని, అప్పటికే సహాయ నిరాకరణలో ఉన్న ఉద్యోగుల మీద ఉన్న ఒత్తిడి మరింత పెరుగుతుందని చెప్పాం. కానీ పరీక్షల టైంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం కరెక్ట్ కాదని, హింస జరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని టీఆర్ఎస్నేతలు వాదించారు. అదే సమయంలో నేను చుక్కా రామయ్యకు ఫోన్ చేసి అడిగితే.. ‘అర్ధాంతరంగా ఆపితే ఇక తెలంగాణ ఉద్యమం ఎక్కడుంటది.. ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. మొత్తం దుకాణమే ఎత్తేయాల్సి వస్తది’ అని ఆయన హెచ్చరించారు. 

అంబులెన్సుల్లో పేషెంట్లలా వచ్చి స్టూడెంట్స్

బారికేడ్లు, ముళ్ల కంచెలతో తెలంగాణ మొత్తాన్ని ఓపెన్ జైలుగా మార్చిండ్రు. ఏదైనా సొంత పని మీద యువకులు హైదరాబాద్కు వచ్చినా.. వారిని వెనక్కి పంపిండ్రు. అయినా చాలా మంది ప్రజలు రెండు, మూడు రోజుల ముందే హైదరాబాద్కు చేరుకుని తమ బంధువులు, స్నేహితుల ఇండ్లు, హోటళ్లలో  తలదాచుకున్నారు. కేయూ విద్యార్థి జేఏసీ నేతలు అంబులెన్స్లో పేషెంట్లలాగా హైదరాబాద్ చేరుకున్నరు. వచ్చిన వాళ్లంతా సమూహంగా కాకుండా ఎవరికి వాళ్లుగా అక్కడికి చేరినవాళ్లే. 

పెళ్లి పేరుతో న్యూడెమోక్రసీ బృందం రాక

ట్యాంక్ బండ్ మీదికి రాకుండా పోలీసులు ఎలాగైనా అడ్డంకులు సృష్టిస్తారని ముందే పసిగట్టిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న ఆర్య సమాజ్లో ఓ జంటకు ఉత్తుత్తి పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి బృందంలా కొత్త బట్టల్లో వారంతా ఆర్య సమాజ్కు ఒక్కొక్కరుగా భారీగా చేరుకున్నారు. సరిగ్గా ఒంటి గంటకు టైమ్ చూసుకుని ట్యాంకు బండ్పై ఒక్కసారిగా దూసుకురావడం మిలియన్మార్చ్కు హైలెట్గా నిలిచింది.

చరిత్రలో ఉద్యమ ఘట్టాలు లేకుండా చేసే కుట్ర

తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిలియన్ మార్చ్, సాగర హారం లాంటి చారిత్రక ఘట్టాలను భవిష్యత్ తరాలకు తెలియకుండా చేసే కుట్ర జరుగుతోంది. కేవలం కేసీఆర్ దీక్షకు దిగిన రోజును మాత్రమే ప్రతి ఏటా దీక్ష దివస్గా నిర్వహిస్తూ దాని వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, ఢిల్లీ సంసద్యాత్ర, పార్లమెంట్ ముట్టడి, మానుకోట ప్రతిఘటన, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు జరిగిన ఉద్యమ ఘట్టాలను మరుగున పడేస్తున్నారు. ఒక్క కేసీఆర్వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పేందుకు ఈ ఘటనలను ఎక్కడా ప్రస్తావించడం లేదు. మేం మూడేళ్ల క్రితం మిలియన్ మార్చ్ను యాది చేసుకుందామని ట్యాంక్బండ్కురావాలని పిలుపునిస్తే.. మాకు అనుమతివ్వలేదు. అంతేగాక వందల సంఖ్యలో అరెస్ట్ చేశారు.

ఒక్కడితోనే తెలంగాణ వచ్చిందని చెప్పేందుకే..

చరిత్ర అనేది వర్తమాన సమాజంలో సజీవంగా ఉంటది. కానీ తాను ఒక్కడినే చావు నోట్ల తలపెట్టి తెలంగాణ తెచ్చుకున్నాననే భావనలో కేసీఆర్ఉన్నారు. తన ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందని చూపించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలను గుర్తు చేసుకునేందుకు కనీసం అనుమతివ్వడం లేదు. ఉద్యమ కాలంలో ఒక్క సకల జనుల సమ్మెకు తప్ప మిలియన్ మార్చ్కు గానీ, సాగరహారానికి గానీ కేసీఆర్ అంగీకారం తెలపలేదు. భారీ బహిరంగ సభలు, ఎన్నికలు తప్ప కేసీఆర్కు మరో వ్యూహం లేనందువల్లే ఇలాంటి నిరసన రూపాలు ఆయనకు ఇష్టముండేది కాదు. సమైక్యాంధ్ర భావనను బద్దలు కొట్టింది ప్రజలే. ప్రజలు ఇలా ఒక శక్తిగా ఎదగడం కేసీఆర్కు ఇష్టం లేదు. ఈ ఘటన గుర్తుకు రావడం ఆయనకు ఇష్టం లేదు. మిలియన్ మార్చ్ గుర్తుకు రావడమంటే ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి యాదికి రావడమే. ఇది జరిగితే తన పీఠం కదులుతుందని కేసీఆర్ భయపడుతున్నాడు.

కేసీఆర్కు ఇష్టం లేకుండే..

కేసీఆర్కు మిలియన్ మార్చ్చేయడం ఇష్టం లేకుండే. ప్రజలు ఎక్కువగా వస్తే హింస జరుగుతుందని ఆయన పైకి ప్రకటించినప్పటికీ.. ప్రజల భాగస్వామ్యంపైనే ఆయనకు అభ్యంతరముండే. కేవలం ఎన్నికలకు వెళ్లడం, భారీ బహిరంగ సభలు పెట్టడమే ఉద్యమమనేది ఆయన ఆలోచన. ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే.. భవిష్యత్లో హక్కుల కోసం ప్రశ్నిస్తారనే భయం ఆయనకుంది. కానీ జేఏసీలో కేసీఆర్ ముఖ్య నాయకుడు కావడంతో మిలియన్ మార్చ్ విషయంలో ఆయనను కాదని పోలేని పరిస్థితి. దీనిపై ఎలా ముందుకెళ్లాలని దాదాపు ఐదు గంటలు చర్చించినం. చివరికి పరీక్షలకు ఇబ్బంది కాకుండా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినం. కేసీఆర్ ఏమంటారోనన్న భయంతో అయిష్టంగానే టీఆర్ఎస్నేతలు ఒప్పుకున్నారు. ఆ కార్యక్రమానికి అప్పటి సిటీ పోలీస్ కమిషనర్ఏకే ఖాన్పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకున్నా ప్రోగ్రాం నిర్వహించి తీరుతామని చెప్పేసి వచ్చాం.
- ప్రొఫెసర్ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు