- ప్రజలెవరూ ఆత్మగౌరవంతో బతకలేరు
- కేయూలో దాడి భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడే
- భారత్ బచావో సదస్సులో ప్రొఫెసర్ కోదండ రామ్
హనుమకొండ/ జనగామ అర్బన్, వెలుగు : రిజర్వేషన్లకు రాజ్యాంగమే ప్రాతిపదిక అని, రాజ్యాంగం పోతే..రిజర్వేషన్లు కూడా పోతాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్అన్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే ప్రజలెవరూ ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండదన్నారు. భారత్బచావో హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సుబేదారిలోని అసుంతా భవన్లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వైఫల్యాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. బీజేపీ నాయకులు మొదట్నుంచీ రాజ్యాంగాన్ని సవరిస్తామంటున్నారని, వాజ్పేయీ ప్రధానిగా ఉన్న సమయంలోనే రాజ్యాంగ సవరణ కోసం జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్వేశారన్నారు.
రాజ్యాంగ పరిరక్షణే అందరి లక్ష్యం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎదిరించిన వారిపై దాడులకు పాల్పడుతోందని, కేయూలో కవులు, రచయితల మీద దాడి భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నవి కాదని..బీజేపీకి..సామాన్య ప్రజలకు మధ్య జరుగుతున్నవేనని స్పష్టం చేశారు. తర్వాత ‘ప్రమాదంలో భారత రిపబ్లిక్, పౌరుల పాత్ర’ అనే అంశంపై ప్రముఖ రచయిత, రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ప్రసంగించారు.
జనగామ విజయ ఫంక్షన్ హాల్లో ఇదే అంశంపై సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించగా పరకాల ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ మతం మన దేశంలో ఒక రాజకీయ అంశంగా మారిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, అయినప్పటికీ మతతత్వ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. సాదిక్అలీ, దళిత రత్న డాక్టర్రాజమౌళి, విద్యావేత్త రియాజ్ పాల్గొన్నారు.