రాజకీయాలకు అతీతం హైడ్రా : కోదండ రెడ్డి

  • బీఆర్ఎస్, మజ్లిస్  నేతలవి అడ్డగోలు విమర్శలు

హైదరాబాద్, వెలుగు: హైడ్రాను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందుతున్న సీఎం రేవంత్  రెడ్డిపై  బీఆర్ఎస్, మజ్లిస్  నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని కిసాన్  కాంగ్రెస్  జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోందని, సామాన్య ప్రజలు హైడ్రాకు పూర్తి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ధర్మం కోసం భగవద్గీతను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం రేవంత్  చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రకృతిని కాపాడడానికి చెరువులను సంరక్షించుకోవాలని కోరారు. 

చిత్తశుద్ధితో సీఎం హైడ్రాను ఏర్పాటు చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా అంతే బాధ్యతతో పనిచేయాలన్నారు. హెచ్ఎండీఏ లో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పీసీసీ అధికార ప్రతినిధులు జ్ఞాన సుందర్, భవానీ రెడ్డి, చనగాని దయాకర్ మాట్లాడుతూ... భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడాలనేది  సీఎం రేవంత్  ప్రయత్నమన్నారు. తెలంగాణ అంతటా హైడ్రాను విస్తరించాలని కోరారు.