- రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. రుణమాఫీ విషయంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మండిపడ్డారు. అసలు రుణమాఫీ చేయడం వాళ్లిద్దరికి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లా డుతున్నారని విమర్శించారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో కోదండరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడూ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘‘
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేశాం. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశాం. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. అర్హులైన రైతులకు రుణమాఫీ కాని పక్షంలో జిల్లాల్లోని నోడల్ ఆఫీసర్లకు దరఖాస్తు పెట్టుకోవాలి” అని సూచించారు. ‘‘బీఆర్ఎస్ 2018లో రూ.20,480 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ.13,300 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఆనాడు బీఆర్ఎస్ రుణమాఫీ ఆలస్యం చేయడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు” అని అన్నారు. ‘‘బీజేపీ పాలసీలు ఏనాడూ వ్యవసాయానికి అనుకూలంగా లేవు. కేవలం బడా పారిశ్రామికవేత్తల కోసమే వారి తాపత్రయం. నల్ల చట్టాలు తీసుకువచ్చి 700 మంది రైతుల ఆత్మహత్యలకు బీజేపీ కారణమైంది. రైతుల కోసం అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేసే నైతిక హక్కు వాళ్లకు లేదు” అని కోదండరెడ్డి అన్నారు.