- గత సర్కార్లో జరిగిన తప్పులు జరగనీయం
హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి తెలిపారు. కొత్త రెవెన్యూ యాక్ట్ పై గురువారం ఫతేమైదాన్ క్లబ్ లో రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలతో కోదండరెడ్డి సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు బీఆర్ ఎస్ , బీజేపీ, ఎంఐఎం నేతలు రాలేదు. కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డి, మన్నే నర్సింహారెడ్డి, ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు హాజరై.. తమ అభిప్రాయాలు వెల్లడించారు.
వీటిని కమిటీలో చర్చించి ప్రభుత్వానికి అందజేస్తామని కోదండరెడ్డి తెలిపారు. మీటింగ్ తర్వాత గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భూస్వామ్య విధానం రావద్దనే ఆనాడు ఇందిరా గాంధీ పేదలకు భూ పంపిణీ ప్రారంభించారని తెలిపారు. భూస్వామ్య విధానాన్ని మళ్లీ తీసుకురావాలని గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. గత బీఆర్ ఎస్ పాలనలో ధరణిలో చాలా అవకతవకలు జరిగాయని, పేదలు భూములు కోల్పోయారని తెలిపారు. పకడ్బందీగా కొత్త రెవెన్యూ యాక్ట్ ఉంటుందని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగనీయబోమని ఆయన స్పష్టం చేశారు.