కేంద్రానికి థ్యాంక్స్: ప్రపంచ దేశాలకు తెలంగాణ పసుపు : కోదండరెడ్డి

హైదరాబాద్: నిజామాబాద్‎లో పసుపు బోర్డు ద్వారా తెలంగాణ పసుపు ఇకపై ప్రపంచ దేశాలకు చేరనుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆయన మోడీ సర్కార్‎కు కృతజ్ఞతలు తెలిపారు. 2025, జనవరి 14వ తేదీ నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటు కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. నిజామాబాద్ పసుపు రైతుల కష్టాలు ఈ సంక్రాంతి పర్వదినం నుండి తీరనున్నాయన్నారు. 

పసుపు బోర్డు ఏర్పాటు చేసి, కార్యకలాపాలు చేపడ్తునందుకు తెలంగాణ పసుపు రైతుల తరుపున కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.  అదే విధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్‎కు  ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో త్వరతగతిన పసుపు బోర్డు కార్యకలాపాలు నిర్వహించడానికి కేంద్ర సర్కార్ ముందుకొచ్చిందని గుర్తుచేశారు.

ALSO READ | నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. జాతీయ పసుపు బోర్డు చైర్ పర్సన్‎గా నిజామాబాద్‎కు చెందిన పల్లె గంగారెడ్డి  నియమితులయ్యారు.  అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె గంగారెడ్డి ప్రస్తుతం  బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2025, జనవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. నిజామాబాద్‎లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స తేదీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని.. 2025, జనవరి 14వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామబాద్‎లోని నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్‎లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స కార్యక్రమం జరగనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చిన మేరకు  పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాదులోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.