సంబురాల్లో పడి.. రైతులను పక్కకుపెట్టిన్రు: కోదండరామ్

సంబురాల్లో పడి.. రైతులను పక్కకుపెట్టిన్రు: కోదండరామ్

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ  సీఎం, మంత్రులు దశాబ్ది సంబురాల్లో పడి రైతుల సమస్యలను పక్కకు పెడ్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేటలో టీజేఎస్ జిల్లా కోకన్వీనర్ అనిల్ రెడ్డి ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలోని  కొనుగోలు సెంటర్లలో ఇంకా వడ్లు అలాగే ఉన్నాయని, పూర్తిస్థాయిలో  కొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. అప్పులు చేసి ఎవుసం చేసిన రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి వారిని ఆదుకోవాలన్నారు. సమావేశంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్​, నాయకులు అనిల్ రెడ్డి,  నీరుడు స్వామి, కీసర స్వామి తదితరులు పాల్గొన్నారు.