- ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా
- హాజరైన మంత్రులు పొంగులేటి, పొన్నం, ఇతర నేతలు
- అమరుల త్యాగ ఫలమే ఈ పదవి: కోదండరాం
- మండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా: ఆమెర్ అలీఖాన్
హైదరాబాద్, వెలుగు: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ జర్నలిస్ట్ ఆమెర్అలీఖాన్ శుక్రవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వారితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించింది. గవర్నర్, ప్రభుత్వాల విధులను కోర్టులు ఆపలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఇద్దరి పదవుల నియామకానికి లైన్ క్లియర్ అయింది.
దీంతో గురువారం రాత్రి ఈ ఇద్దరి నియామకాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో టీజేఎస్ కార్యకర్తలు, కోదండరాం అభిమానులు తరలివచ్చారు.
ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిల్ లోని మీడియా పాయింట్ వద్ద కోదండరాం, ఆమెర్ అలీఖాన్ మాట్లాడారు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగానే తాను ఎమ్మెల్సీ అయ్యానని కోదండరాం తెలిపారు. తన దృష్టిలో అధికారం అనేది ప్రజాసేవ కోసం వచ్చే అవకాశం మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్య పాలనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనకు ఈ అవకాశం వచ్చిందని అన్నారు.
ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఆమెర్అలీఖాన్ మాట్లాడుతూ.. ఈ పదవి ద్వారా మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. తనను ఎమ్మెల్సీ అవకాశమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గన్ పార్కు వద్ద ఉన్న అమరవీరులు స్తూపానికి వారు నివాళి అర్పించారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు అభినందించారు.
తెలంగాణ ఉద్యమసారథికి నిజమైన గుర్తింపు
తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్‌కు కాంగ్రెస్ సర్కారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి నిజమైన గుర్తింపు ఇచ్చిందని రెవెన్యూ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కోదండరామ్‌కు వారు శుభాకాంక్షలు తెలిపారు.
యావత్ రెవెన్యూ ఉద్యోగుల తరఫున సీఎం రేవంత్‌తోపాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ లచ్చిరెడ్డి, కే రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రాములు, రమేశ్పాక తెలిపారు. కోదండరాంకు మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.