ధరణిలో తప్పుల సవరణకు రైతులెందుకు డబ్బు కట్టాలి? : కోదండరాం

  • రూ.60 వేల కోట్ల విలువైన భూములు చేతులు మారినయని ఆరోపణ
  • కేసీఆర్ ను గద్దె దింపితేనే ధరణి పీడ పోతది: వెంకట నారాయణ 
  • కరీంనగర్  ఫిల్మ్ భవన్ లో ధరణిపై  రౌండ్ టేబుల్ సమావేశం 

కరీంనగర్, వెలుగు : ధరణి పోర్టల్ లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలకు రైతులు ఎందుకు నష్టపోవాలని, అందులో తప్పులను సవరించేందుకు రైతులు ఎందుకు డబ్బులు కట్టాలని టీజేఎస్  చీఫ్​  కోదండరాం ప్రశ్నించారు. తెల్ల కాగితం మీద దరఖాస్తు రాసిస్తే.. ఊర్లకు పోయి ధరణిలో తప్పులను ప్రభుత్వమే  పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్  డెమోక్రటిక్  ఫ్రంట్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్  ఫిల్మ్ భవన్ లో ‘ధరణి ఒక చీడపీడ’ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కోదండరాం, సామాజికవేత్త, ప్రొఫెసర్ వెంకటనారాయణ, హైకోర్టు అడ్వొకేట్ సాధిక్ అలీ, ప్రజామిత్ర నిర్వాహకులు కొరివి వేణుగోపాల్, కాంగ్రెస్ నేత మెన్నేని రోహిత్ రావు  తదితరులు ఈ భేటికి హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 9.20 లక్షల సాదాబైనామా అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కోనేరు రంగారావు సిఫార్సుల ప్రకారం సాదాబైనామా ఉంటే వెంటనే పట్టా ఇవ్వాలని కోరారు. ‘‘కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల కొత్త చిక్కులు వచ్చినయ్. సీసీఎల్ఏ ఆఫీసులో కంప్యూటర్లన్నీ పైస్థాయి ఆదేశాలతోనే పనిచేస్తున్నయి. పైరవీలు చేసుకునే వారికే సీసీఎల్ఏలో పనులు అవుతున్నయి. నవాబులు వదిలేసిన ఖరీజ్  ఖాతా భూములన్నీ ప్రభుత్వ పెద్దల పేరిటమార్చుకున్నరు. రూ.60 వేల కోట్ల విలువైన ఆరు వేల ఎకరాల భూములు చేతులు మారాయి. ధరణి ప్రభుత్వ పెద్దల కోసమే తప్ప మన కోసం కాదు. కొట్లాడితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు” అని కోదండరాం అన్నారు. మన ఓట్లతో గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలు మన కోసం పనిచేయకుండా ఇసుక దందాలు చేస్తున్నారని, ఎన్నికలకు ముందే వారిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. 

హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి: సాధిక్ అలీ

ధరణి సమస్యలపై తాను రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నానని హైకోర్టు అడ్వొకేట్  సాధిక్  అలీ తెలిపారు. ప్రతి ఊరిలో ప్రజలు భూములకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారని, హైకోర్టు ఆదేశాలు అమలుచేయాలని ఆయన కోరారు. 

రాష్ట్రానికి పట్టిన చీడ కేసీఆర్: ప్రొఫెసర్ వెంకట నారాయణ 

రాష్ట్రానికి పట్టిన చీడ కేసీఆర్ అని, ఆయనను గద్దె దింపితేనే ధరణి పీడ పోతుందని సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్  వెంకట నారాయణ అన్నారు. అవినీతితో దేశంలో రాజకీయాలను ప్రభావితం చేయాలని కేసీఆర్  చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు కాళేశ్వరం ఒక్క దాంట్లోనే అవినీతి ఉందనుకున్నామని, కానీ ఇప్పుడు భూములు, రియల్ ఎస్టేట్  వ్యాపారం ద్వారా రూ.వేలకోట్ల అవినీతి జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. హిరణ్యకశ్యపుడు భూమిని చాపలా చుట్టినట్లు తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్  తన సంకన పెట్టుకోవాలనుకుంటున్నారని విమర్శించారు.

కరీంనగర్ నుంచే నాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, మళ్లీ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి ద్వారా వేల ఎకరాల భూములను దొరలకు ధారాధత్తం చేశారని ఆరోపించారు. రూ.65 వేల కోట్లు రైతు బంధు రూపంలో ఇస్తే.. అందులో 60 శాతం భూస్వాములకే చేరిందన్నారు.