రెగ్యులర్ చేయాలంటే బెదిరిస్తరా?
జేపీఎస్ లది ఆత్మగౌరవ పోరాటం
టీజేఎస్ చీఫ్ కోదండరామ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : జూనియర్ పంచాయతీ సెక్రటరీలది ఆత్మ గౌరవ పోరాటమని, రెగ్యులరైజ్ చేయాలని న్యాయపోరాటం చేస్తుంటే ప్రభుత్వం బెదిరిస్తోందని తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్ ఆరోపించారు. శనివారం ఆయన సిరిసిల్లలో జేపీఎస్ లు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. డ్యూటీలో చేరమని జేపీఎస్ ల కుటుంబ సభ్యులను కూడా బెదిరించడం అన్యాయమన్నారు.
ప్రభుత్వం జేపీఎస్ లతో చర్చలు జరిపితే సమస్య కొలిక్కి వస్తుందన్నారు. పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించిన జేపీఎస్ లకు అన్ని హక్కులుంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా రెండేండ్లు మాత్రమే ప్రొబెషనరీ పీరియడ్ ఉంటుందని, కాని జేపీఎస్ లు నాలుగేళ్లుగా డ్యూటీ చేస్తున్నా రెగ్యులర్ చేయకపోవడం ప్రభుత్వ బాధ్యతరాహిత్యేమని విమర్శించారు. ఇప్పటికైనా జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి టీజేఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.