‘‘కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదు’’ అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ‘‘రాజకీయం కలుషితం అయిందని, పైసల చుట్టూనే రాజకీయం తిరుగుతోందని విమర్శించారు. మార్పు సాధించే దిశగా ముందుకు వెళతామని, ఇందుకోసం ఉద్యమకారులను ఏకం చేసి అస్థిత్వం కాపాడుకుంటాం’’ అని తేల్చి చెప్పారు. గోదావరి జల సాధన యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న జలయజ్ఞం శిలా ఫలకాన్ని కోదండరాం పరిశీలించారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం కొట్లాడింది, త్యాగాలు చేసింది జనమైతే.. ఆస్తులు మాత్రం పాలకులవి పెరిగాయని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం అడుగంటిందని, కృష్ణా నీళ్లను ఆంధ్రాకు. గోదావరి జలాలను కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం కొట్లాడినట్టే.. తెలంగాణ వస్తే అభివృద్ధి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్న మాటలను కోదండరాం గుర్తు చేశారు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు.
ఇక తెగించి కొట్లాడుతాం..
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3480 కోట్లతో ప్రారంభించగా, టీఆర్ఎస్ సర్కారు రూ.700 కోట్లే ఖర్చు చేసిందని కోదండరాం విమర్శించారు. 2021 నాటికి రూ.లక్ష కోట్లు ఇరిగేషన్ కోసం ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మరో రూ.2800 కోట్లు ఇచ్చి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు 22 ప్యాకేజీల ద్వారా సాగునీటిని అందించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లాపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండటంతోనే నిధుల లేమితో భూంపల్లి రిజర్వాయర్ వెక్కిరిస్తోందని అన్నారు. దానికి సంబంధించిన భూసేకరణతో పాటు 24 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారని వివరించారు. పెద్దఎత్తున రైతు ఆత్మహత్యలు జరిగిన, అత్యధిక వలసలు జరిగిన ప్రాంతాల్లో కామారెడ్డి ఒకటని చెప్పారు. ఎక్కడి కాంట్రాక్టర్ల ఎక్కువ డబ్బులిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడి ప్రాజెక్టులపై మాత్రమే దృష్టిపెడుతోందని కోదండరాం ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, 27 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇచ్చిందని వెల్లడించారు. ప్రజా హక్కులను సాధించేందుకు ఇక తెగించి కొట్లాడాలని నిర్ణయించినట్లు కోదండరాం స్పష్టం చేశారు. ఇందుకోసం గోదావరి జలసాధన యాత్రను మొదటి మెట్టుగా అభివర్ణించారు. జూన్ 6న హైదరాబాద్లో తెలంగాణ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తలు..