కేసీఆర్​ను గద్దె దించేందుకు కలిసి పనిచేద్దాం: కోదండరాంను కోరిన రాహుల్

  • తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని టీజేఎస్ చీఫ్ ప్రపోజల్ 
  • కాంగ్రెస్​తో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యామని ప్రకటన

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ ను గద్దె దించేందుకు కలిసి పని చేద్దామని, ఇందుకు మద్దతు తెలపాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కోరారు. శుక్రవారం కరీంనగర్ లోని ఓ హోటల్ లో రాహుల్ తో కోదండరాం భేటీ అయ్యారు. గత పదేండ్ల నుంచి కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టామని, ప్రజల్లో కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని రాహుల్ కు కోదండరాం చెప్పారు.

కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక నోట్ కూడా అందజేశారు. రాహుల్ తో భేటీ తర్వాత కోదండరాం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు కలిసి పని చేద్దామని రాహుల్ తనతో చెప్పారని ఆయన వెల్లడించారు. ‘‘తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిలైంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ మరిచిపోయారు. నియంతృత్వ, నిరంకుశ పాలనను అంతం చేసేందుకు కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లడానికి సిద్ధమయ్యాం. టీజేఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా, తెలంగాణ విశాల ప్రయోజనాల కోసమే” అని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

నాలుగు సీట్లు కోరిన కోదండరాం..  

తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని రాహుల్ ను కోదండరాం కోరారు. ఎల్లారెడ్డి, ముథోల్, జహీరాబాద్, కోరుట్ల నియోజకవర్గాలు కేటాయించాలని ప్రతిపాదించారు. అభ్యర్థుల జాబితానూ అందజేశారు. ఎల్లారెడ్డికి డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, ముథోల్- కు సర్దార్ వినోద్ కుమార్, జహీరాబాద్- కు ఆశప్ప, కోరుట్లకు -మోహన్ పేర్లు ఇచ్చారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. టీజేఎస్ స్టేట్ ఆఫీసుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడతారని చెప్పారు. ప్రతిపాదించిన సీట్లపై, అజెండాపై చర్చిస్తారని తెలిపారు. కోదండరాం వెంట ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, అంబటి శ్రీనివాస్, బైరి రమేశ్, నిజ్జన రమేశ్, సర్దార్ వినోద్ కుమార్, మోహన్ రెడ్డి, కిరణ్, గట్టయ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.