- ప్రభుత్వం కూల్చేస్తామనడం అనాగరికం: కోదండరాం
- బీఆర్ఎస్ లీడర్లకు రాజ్యాంగం మీద నమ్మకం లేదని విమర్శ
నర్సంపేట/భూపాలపల్లి రూరల్, వెలుగు: అరాచక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నాయకుల తీరు మారడం లేదని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ తెలంగాణ సర్కార్‌ను కూల్చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడటం అనాగరికమని మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని టీజేఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంబటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రుల ఆధిపత్యం, నిరంకుశ పాలన, అసమానతలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అంతులేని అవినీతి, నియంతృత్వం, అరాచకంతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకున్నారని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం పట్ల వారికి నమ్మకం లేదన్నారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏరియాల్లోని గనుల్లో పర్యటించి కోదండరాం మాట్లాడారు. సింగరేణి కార్మికులను మోసం చేసిన కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఆరు సార్లు గెలిచిన సంఘాలు.. కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ సంఘాలు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం వైపు నిలిచి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టాయని ఆరోపించారు. కార్మికుల పక్షాన పోరాడుతున్న యూనియన్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి కార్మికుడికి రెండు గుంటల స్థలంతో పాటు రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందిస్తామన్నారు. ప్రైవేట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు.