ప్రజాస్వామిక తెలంగాణ రాలే..మరో ఉద్యమమే మార్గం

 ప్రజాస్వామిక తెలంగాణ రాలే..మరో ఉద్యమమే మార్గం

రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయ్యింది. ఉదాత్తమైన లక్ష్యాలతో సాగిన ప్రజా పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ  రాష్ట్రంలో,  ఇయ్యాల  కేసీఆర్ ఏలుబడిలో, ఉద్యమ విలువలకే గౌరవం లేకుండా పోయింది.  ఒక ప్రాంతం వేరొక ప్రాంతం మీద పెత్తనం చెలాయించరాదని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాల ఆధారంగా ప్రాంతాలు, సమూహాలు, వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడాలని తెలంగాణా ఉద్యమం ప్రకటించింది. ఒక ప్రాంతాన్ని వేరొక ప్రాంతం అవహేళన చేయడం, దోచుకోవడం, అణచివేయడం చెల్లదని తెలంగాణా ఉద్యమం తేల్చి చెప్పింది. తెలంగాణ ఉద్యమం కేవలం ప్యాకేజీల  కోసమో, గుప్పెడు మంది నాయకుల రాజకీయ ప్రయోజనాలను కాపాడటానికో, సెంటిమెంటు ఆధారంగానో సాగలేదు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ కొట్లాడింది. ఇక్కడి వనరులను ఇక్కడి ప్రజల అవసరాల కోసం ఉపయోగించుకునే అధికారం కోసం, అస్తిత్వ పరిరక్షణ కోసం సాగిందీ ప్రజా పోరాటం. ఈ ఉద్యమ నిర్మాతలు ప్రజలే. ఎక్కడికక్కడ సంఘాలుగా ఏర్పడి రాష్ట్ర సాధన కోసం ఆంధ్రా పాలకుల ఆధిపత్యాన్ని ఎక్కడికక్కడ కూలదోశారు. సమైక్య వాదుల ఆధిపత్య మూలాలను దిగువ స్థాయిలో కూకటి వేళ్ళతో పెకిలించి వేశారు.  ఈ పరిణామాల వల్ల సమైక్య వాదం ఆధారంగా రాజకీయాలు నడపలేని పరిస్థితి ఏర్పడి రాష్ట్ర విభజన అనివార్యమైంది. 

ప్రజాస్వామిక  తెలంగాణ కావాలి

ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రజలు కేవలం భౌగోళిక తెలంగాణ ఏర్పడితే చాలని అనుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత అన్ని వర్గాలకు, కులాలకు  లాభం జరగాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజలందరి సంక్షేమాన్ని పట్టించుకోగల ఆ వ్యవస్థకు సామాజిక తెలంగాణలేక ప్రజాస్వామిక తెలంగాణ అని పేరు పెట్టారు. ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణ లేక సామాజిక తెలంగాణ ఏర్పడాలని కోరుకున్నారు. ఉద్యమ స్వభావాన్ని అర్థం చేసుకొని, ఉద్యమ లక్ష్యాల సాధన కోసం పాలకులు కృషి చేస్తే ఇయ్యాల తెలంగాణ ప్రజలు సంతోషించే వారు. కానీ పాలకులు రాష్ట్రం ఏర్పడగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. దాని అర్థం అన్ని పార్టీల వలెనే టీఆర్​ఎస్​ పని చేస్తోందని,  ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోవడం కర్తవ్యంగా మారింది అని.   ఇలా లక్ష్యాలు మార్చుకున్న తరువాత తలెత్తిన పరిణామాలు అందరికీ తెలిసినవే.  

నిరంకుశ పాలన

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇయ్యాల కేసీఆర్ సొంత ఆస్తిగా మారి, ఆయన గడిలో బందీ అయిపోయింది. కేసీఆర్ నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలకు వనరులలో వాటా దక్కలేదు, పాలనలో భాగస్వామ్యం దొరకలేదు. ఉద్యోగం, ఉపాధి కరువై ఎందరో యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో సాగుతున్న అప్రజాస్వామిక   పాలనలో వ్యవస్థలన్నీ  కుప్పకూలాయి. పాలకులకు ప్రజల హక్కుల పట్ల వీసమెత్తు గౌరవం కూడా లేదు. తాము కోట్లాడి తెచ్చిన రాష్ట్రంలోనే ప్రజలు పరాయి వాళ్ళై పోయారు. ఉద్యోగం, ఉపాధి దక్కక, వనరులు అందక, అభివృద్ధిలో వాటా దొరకక ఆగమై పోయారు. సీమాంధ్ర కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం విచ్చలవిడిగా తెలంగాణ వనరులను, ప్రజల ఆస్తులను దోచుకుంటోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు చాలా మంది అటు తరువాత ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తూనే ఉన్నారు. చట్టబద్ధంగా నిరసన తెలపడానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయినా, ఈ ఎనిమిదేండ్ల కాలంలో ఉద్యమ ఆకాంక్షలను బతికించడానికి, ప్రజల ప్రజాస్వామిక చైతన్య జ్యోతిని కాపాడటానికి కృషి చేసినా   ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వేసినట్టున్నది. 

ఉద్యమకారులు ఉద్యమించకపోతే..

కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించడానికి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్న  ప్రయత్నాలను  ఇంకా సంఘటితంగా ముందుకు  తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉద్యమ శక్తులు ఉమ్మడిగా ప్రయత్నం చేయకుండా అనుకున్న ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణ సాధ్యం కాదు.  ఇప్పుడు ఉద్యమకారులు  పట్టించుకోకపోతే పాలకులు మారవచ్చునేమో కానీ పాలన మారదు. ఉద్యమకారులు భాగస్వామ్యం తీసుకోకుండా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం సాధ్యంకాదు. ఒక వ్యక్తి పెత్తనాన్ని కూలదోసి, ప్రజాస్వామిక తెలంగాణను సాధించే లక్ష్యంతో ఉద్యమకారుల ఐక్యత నేటి కర్తవ్యం. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమమే మార్గం. 

- ఎం. కోదండరామ్, టీజేఎస్​ అధ్యక్షులు