తెలంగాణ ఎట్లా వచ్చిందో తెలిస్తే తప్ప ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైనా ఈ చర్చ చేయడం చాలా అవసరం. ఇప్పుడు వెళ్తున్న మార్గంలోనే సాగితే తెలంగాణ పతనం తప్పదు. ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవటానికి చర్చను లేవనెత్తక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ బొక్కసం ఖాళీ అయిపోయింది. పైసలు లేక జీతాలను, పెన్షన్లను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. కృష్ణా నదిలో మనవాటాను కాపాడే శక్తిని ప్రభుత్వం ప్రదర్శించడం లేదు. చేష్టలుడిగి బిత్తరపోయి చూస్తున్నది. గోదావరి నదిలో దక్కిన వాటాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ప్రభుత్వం దగ్గర ఏ ప్రణాళికా కనిపించడం లేదు. ఉద్యోగాల కల్పన ఎజెండా మీద లేనేలేదు. ఉద్యమ లక్ష్యాలకు దూరమవుతున్న దశలో ఉన్నాం. అందుకే చాలా విషయాలను మాట్లాడుకోవాల్సిన అవసరమున్నది. ముఖ్యంగా మనమందరం కలిసి కొట్లాడితేనే ఈ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని మరచిపోరాదు.
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది ప్రజా సంఘాలే. వరంగల్‌లో 1996 నవంబర్ 1 నాడు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవ్ రావు జాధవ్, భూపతి కృష్ణమూర్తి వంటివారు నిర్వహించిన విద్రోహ దిన సభ.. తెలంగాణ ఉద్యమం మొదలవడానికి కారణమైంది. ఆ సభ స్ఫూర్తితోనే చాలా చోట్ల తెలంగాణ సంఘాలు పుట్టుకొచ్చాయి. అవి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను వెలుగులోకి తెచ్చి, ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలను కదిలించాయి. 1996 తర్వాత ఏర్పడిన ప్రజాసంఘాలే తెలంగాణ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్లి ప్రజలను కూడగట్టాయి. అయితే ప్రజాసంఘాలు చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నాయి. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులను నక్సలైట్ ముద్ర వేసి ప్రభుత్వం వేధించింది. కొందర్ని ఎన్కౌంటర్ పేరుతో చంపేశారు. తెలంగాణ ఒక రాజ్యాంగ బద్ధమైన డిమాండ్. అప్పుడు తెలంగాణ డిమాండ్ కోసం కూడా పనిచేయడం కష్టమైపోయింది. ప్రజా సంఘాల కృషితో తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలపడింది. కానీ ఆ ఆకాంక్షకు రాజకీయ వ్యక్తీకరణ ఇవ్వడానికి అప్పటి పరిస్థితిలో ఏ పార్టీ కూడా ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు జరగాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాక, రాష్ట్ర ఆవశ్యకతను అన్ని పార్టీల నాయకులకు వివరించి, ఆ అంశాన్ని రాజకీయ అజెండా మీదికి తేవడానికి సహకరించాల్సిందిగా కోరారు. టీఆర్ఎస్ ఆవిర్భావం ఈ పరిస్థితిలో జరిగింది.
ఆ ఆందోళనలే ఉద్యమాన్ని సజీవంగా ఉంచాయి
2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించి ఎదుగుతున్న సమయంలో 2004 సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కూడా తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ అంశం ఢిల్లీకి చేరింది. 2004 ఎన్నికల తర్వాత ఒక వైపు రాజకీయ రంగంలో ఆయా పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతుండగా మరొక వైపు ప్రజాసంఘాలు రాష్ట్ర స్థాయిలో తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాయి. రాజకీయ పక్షాలు, తెలంగాణవాదులు.. సమాంతరంగా తమ కార్యక్రమాలను నిర్వహించాయి. 2004 తర్వాత రాజశేఖరరెడ్డి పాలనలో తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తి, న్యాయాన్ని కోరుతూ ప్రజాసంఘాలు అనేక కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలే ఉద్యమాన్ని సజీవంగా ఉంచాయి. నిరంతరం కార్యక్రమాలు జరుగుతుండటంతో రాష్ట్ర సాధన డిమాండ్‌కు మద్దతు పెరిగింది.
2,50,000 కొలువులు ఖాళీ
నియామకాల విషయాని కొస్తే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి భర్తీ అయిన ఉద్యోగాల సంఖ్య సుమారు 50 వేల దాకా ఉంటుంది. ఇంకా సుమారు 2.5 లక్షల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే సంకల్పం కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భర్తీ చేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. అన్ని ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేయాలని అడిగినా ఇప్పటికీ స్పందన లేదు. అదే విధంగా నిరుద్యోగులుగా ఉన్న యువతకు శిక్షణ ఇప్పించాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసింది.
ఆ 80 వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవి
తెలంగాణ ఏర్పడిన నాటికే 33 భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 30 ప్రాజెక్టులు 2017–18 నాటికి పూర్తి కావాలి. వీటి అంచనా వ్యయం రూ.1,10,069 కోట్లు. 2015 మార్చి నాటికి సుమారు రూ. 42,600 కోట్లు ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో రెండింటిని రద్దు చేశారు. అవి దుమ్ముగూడెం–సాగర్ టైల్ పాండ్, కంతానపల్లి. వాటి స్థానంలో తుపాకుల గూడెం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేరినయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. కానీ ప్రభుత్వం రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.40 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచింది. అందువల్ల ఇప్పటికే ఖర్చయిన రూ. 8 వేల కోట్లు వృథా అయ్యాయి. ఇప్పుడు అప్పు చేసి మరో రూ. 25 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును మరింత విస్తరిస్తున్నారు. ఇప్పటి వరకు అయిన ఖర్చు సరిగ్గా చేసివుంటే అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఆర్థిక సంక్షోభం కారణంగా భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కూడా పూర్తయ్యే పరిస్థితి
కనిపించడం లేదు.
గుప్పెడు మంది కోసమే అధికారం
లక్ష్యాలు లేకుండా ఏ ఉద్యమం కూడా ముందుకు సాగదు. ప్రజాసంఘాలే తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను నిర్ణయించాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం నడిచింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణకు తన భవిష్యత్తును తానే నిర్ణయించుకో గల అధికారం దక్కుతుంది. అయితే రాష్ట్రం ఏర్పడ్డాక జరిగింది మరొకటి. ప్రభుత్వం అధికారాన్ని గుప్పెడు మంది కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించింది. అందువల్ల ఆర్థిక పరిస్థితి దిగజారింది. దానికి ఆర్థిక మందగమనం తోడైంది. ఇప్పుడు కరోనాతో పరిస్థితి మరింత దిగజారింది. 2018–19లో రాష్ట్ర ఆదాయం రూ.1,56,981 కోట్లు కాగా, 2019–-20 ఆదాయం 1,46,544 కోట్లకు తగ్గింది. తుది లెక్కలు వస్తే ఇంకా పడిపోతుంది. ఇకపోతే 2020–-21 ఆదాయం విపరీతంగా పడిపోనున్నది. వచ్చే ఆదాయంలో సుమారు 14,500 కోట్ల దాక వడ్డీ చెల్లింపులకు ఖర్చవుతున్నది. ఇప్పటి నుంచి రోజువారీ ఖర్చులకే నిధుల కొరత తలెత్తనున్నది. అభివృద్ధి కోసం పెట్టుబడి ఖాతా కింద పైసలు కేటాయించడం కష్టమే.
ధనిక రాష్ట్రం.. ఇప్పుడు ఇట్లెందుకైంది?
ధనిక రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తెలంగాణ ఇట్లా ఎందుకు మారిం ది? కారణం కేసీఆర్ రాజకీయ వ్యూహంలోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలు పాత్ర నిర్వహిం చారు అనే విషయాన్ని కేసీఆర్ అసలే అంగీకరిం చరు. తెలంగాణ అంటే కేసీఆర్ అనే దృక్పథంలో ప్రజాస్వామిక చర్చకు స్థానం లేదు. ఎన్నికల్లో ఓటువేయడం మినహా ఎవరికీ మరొక స్వేచ్ఛ లేదు. రాజకీయాల్లో భాగస్వామ్యానికి అవకాశం అసలే ఉండదు. ఈ దృక్పథంతో గుత్తా ధిపత్యాన్ని నిలబెట్టు కోవడానికి ప్రకటనలు ఎరవేసి మీడియాను గుప్పిట్లో పెట్టు కున్నారు కేసీఆర్. పైసలతో ప్రతిపక్షాల నాయకులను నియంత్రిస్తున్నా రు. ఇంతటి నిరంకుశత్వం తో ప్రభుత్వ అధికారాన్ని గుప్పెడు మంది కాం ట్రాక్టర్ల స్వార్థ ప్రయోజనాల రక్షణ కోసం వాడుతున్నారు. ఆ క్రమంలో వనరులను తమకు కావాల్సిన వారికి పంచడానికి ప్రయత్నం జరుగుతున్నది. అందువల్లే విద్య, వైద్య రంగాల్లో మనం అన్ని రాష్ట్రా లకన్నా వెనుకబడి ఉన్నాం . నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రయత్నమే లేదు. అంబేద్కర్ అన్నట్టు .. అధికారాన్ని చట్టబద్దంగా చెలాయిం చినప్పుడు ప్రజల ప్రయోజనాలు ప్రధానమైతాయి, ఇష్టానుసారంగా చెలాయిస్తే వ్యక్తిగత ప్రయోజనమే ప్రధానమౌతుం ది. ఇప్పుడు మన రాష్ట్రంలో అంబేద్కర్ చెప్పిన రెండవ పద్ధతిలో పాలన సాగుతున్నది. ఓట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రజాకర్షక విధానాలు అమలు కావచ్చు. కానీ ప్రజలను స్వశక్తులుగా మార్చి, తమ కాళ్ల మీద తాము నిలబడి ఆత్మగౌరవంతో బతికే శక్తిని
కల్పించడం కేసీఆర్ రాజకీయాల లక్ష్యం కాదు.
For More News..