తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన చూసి ప్రజల గుండెలు మండుతున్నాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మనమందర ఎంతో కొట్లాడి, ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణను ఒక్క కుటుంబం అడ్డగోలుగా దోచుకుందని ఆరోపించారు. 2023, నవంబర్ 10వ తేదీ శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభకు ప్రొఫెసర్ కోదండరామ్ హాజరై మాట్లాడారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడం వల్లే కాళేశ్వరానికి నేడు ఆ గతి పట్టిందని అన్నారు. ఇంటికో ఉద్యోగం అని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా మోసం చేశారని.. పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
కష్టపడి చదివిన ప్రవళిక.. పరీక్షలు వాయిదా పడటంతో ఉద్యోగం రాదని ఆత్మహత్య చేసుకుంటే.. ప్రేమ విఫలమే కారణమని కేటీఆర్ అన్నారని.. నీ బిడ్డ అయితే ఇలాగే మాట్లాడతావా? కేటీఆర్ అని కోదండరామ్ ప్రశ్నించారు. కళాశాల బయట చాయ్ తాగిన పాపానికి ప్రవళిక వ్యక్తిత్వాన్ని మంట కలిపారని మండిపడ్డారు. ఎక్కడ ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయోనని ప్రవళిక ఆత్మహత్యను పక్కదారి పట్టించారని అన్నారు.
నిజాయితీగా పని చేయాలని చెప్పిన పాపానికి కేసీఆర్ తనను దూరం పెట్టారని చెప్పారు. కామారెడ్డి పోరాట వేదికగా నిలిచిందని.. ఇక ప్రజల తీర్పే శిరోధార్యమని అన్నారు. తెలంగాణ ఫలితం అందరికి రావాలని మనం అంటుంటే.. ఒక్క కుటుంబానికే దక్కాలని కేసీఆర్ అంటున్నారని అన్నారు. మెడిగడ్డ బ్యారేజీ ఎలా కూలిందో.. కేసీఆర్ ప్రభుత్వం కూడా అలాగే కప్పకూలుతుందని కోదండరామ్ పేర్కొన్నారు.