- డిజైన్ లోపాలపై సిట్టింగ్‌జడ్జితో ఎంక్వైరీ చేయించాలె
- టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
- కన్నెపల్లికి వెళ్లకుండా అరెస్ట్ చేసిన పోలీసులు
మహదేవపూర్ : కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్ లకు వరదలు, మానవ తప్పిదాల వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఈ నష్టాన్ని కాంట్రాక్టరే భరించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మండలాల్లో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తర్వాత కాళేశ్వరం చేరుకున్న కోదండరాంను, ఇతర టీజేఎస్ లీడర్లను పోలీసులు కన్నేపల్లి పంపుహౌస్ కు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. మహదేవపూర్ పీఎస్‌కు తరలించారు.
అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ వాస్తవ విషయాలు బయటికి రాకుండా డ్యామేజీ అయిన పంప్‌హౌజ్‌లను చూడనీయని ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. పంపు హౌజ్‌లను చూస్తే డిజైన్ లోపాలు బయట పడతాయని, ఏమేరకు నష్టం జరిగిందో తెలుస్తుంది కాబట్టి అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించాలని, నిజాలు వెలుగులోకి తీసుకువచ్చి, నష్టానికి కారకులై వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.