బీఆర్ఎస్, కాంగ్రెస్  కార్యకర్తల మధ్య ఘర్షణ .. భూనిడ్​ గ్రామంలో ఉద్రిక్తత

బీఆర్ఎస్, కాంగ్రెస్  కార్యకర్తల మధ్య ఘర్షణ .. భూనిడ్​ గ్రామంలో ఉద్రిక్తత

మద్దూరు, వెలుగు: మండలంలోని భూనిడ్  గ్రామంలో మంత్రి మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం రాత్రి నిర్వహించిన రోడ్ షో ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్​ పక్కనే ఉన్న కాంగ్రెస్  పార్టీ ఆఫీస్ ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు జెండా ఊపుతూ జై కాంగ్రెస్  అంటూ నినాదాలు చేశారు. మీ హయాంలో ఎలాంటి అభివృద్ది కాలేదంటూ రోడ్ షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్  కార్యకర్తలు వారిపైకి రావడంతో తోపులాట జరిగింది.

దీంతో గ్రామంలో రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్  కార్యకర్త చేతికి గాయమైంది. పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టారు. ఇదిలాఉండగా ఆదివారం ఉదయం గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్​ నేతలు దహనం చేశారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గూండా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. అనంతరం మద్దూరు పోలీస్ స్టేషన్ లో రెండు పార్టీల నాయకులు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల జోక్యం చేసుకొని రెండు పార్టీల కార్యకర్తలను సముదాయించడంతో ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు.