పోలీసుల చేతికి కోడెల పోస్ట్​మార్టం రిపోర్ట్

పోలీసుల చేతికి కోడెల పోస్ట్​మార్టం రిపోర్ట్

హైదరాబాద్/ అమరావతి, వెలుగు:

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన బెడ్ రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్స్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు.

ఆత్మహత్యకు ముందు కోడెల 24 నిమిషాలపాటు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.  సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఔట్ గోయింగ్ కాల్ వెళ్లినట్లు గుర్తించారు. కోడెలకు చెందిన మరో పర్సనల్ మొబైల్ ఫోన్ మిస్ అయినట్లు తెలుస్తోంది. కోడెల కూతురు విజయలక్ష్మి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఆ మొబైల్ సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లో ఉందని, తర్వాత స్విచ్ ఆఫ్ అయిందని పోలీసులు గుర్తించారు. ఆ మొబైల్ దొరికితే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది.

కేబుల్ వైర్ స్వాధీనం

కోడెల ఆత్మహత్య చేసుకున్న బెడ్ రూమ్ ను మంగళవారం పరిశీలించిన పోలీసులు క్లూస్ సేకరించారు.  ఆత్మహత్యకు ఉపయోగించిన  కేబుల్ వైర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెడ్ రూమ్ అణువణువును వీడియో తీశారు. బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలోని 3 స్పెషల్ టీమ్స్ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో దుమారం లేపుతున్న ఈ కేసులో పారదర్శకత ఉండేలా సైంటిఫిక్ ఆధారాలను సేకరిస్తున్నారు. కోడెల అంత్యక్రియలు పూర్తైన తరువాత శివరాంను విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు.

పోలీసుల చేతికి పోస్ట్ మార్టం రిపోర్ట్

కోడెల పోస్ట్ మార్టమ్ రిపోర్టును సీల్డ్ కవర్ లో ఉస్మానియా డాక్టర్లు బంజారా హిల్స్ పోలీసులకు అందించారు. కేబుల్ వైర్ వాడడం వల్ల మెడపై గాట్లు పడ్డాయని, హెడ్ బోన్ విరిగిపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నట్లు సమాచారం.

నరసరావుపేటలో నేడు అంత్యక్రియలు

కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను బుధవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఆదేశించారు. మంగళవారం కోడెల భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు కోడెల మృతదేహం రాగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.

ఫారెన్​ నుంచి వచ్చిన కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ అంబులెన్సులో తండ్రి భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కూడా కోడెల మృతదేహం వెంటే వచ్చారు.  ప్రజల సందర్శనార్థం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల భౌతికకాయాన్ని ఉంచారు. బుధవారం ఉదయం  కోడెల భౌతికకాయాన్ని నరసరావుపేటకు తరలిస్తారు.  నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీసులు 144 సెక్షన్ విధించారు.

సీబీఐతో విచారణ జరిపించాలి: చంద్రబాబు

కోడెల ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. “ఓ పొలిటీషియన్​ ఇలా చనిపోవటం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఇది ముమ్మాటికీ  ప్రభుత్వ హత్యే. కోడెల, ఆయన కుమారుడు, కూతురు మీద 19 కేసులు పెట్టి మానసికంగా కుంగేలా చేశారు.  కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారు. కట్టుకున్న లుంగీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటే..ఎంత క్షోభ చెందారో అర్థమవుతోంది” అన్నారు. సర్కారు అరాచకాలతో రాజకీయ నేతలు ఆత్మహత్యలు చేసుకోవాలా అని ప్రశ్నించారు. ఇది టెర్రరిస్టులకంటే ప్రమాదకరమైన ప్రభుత్వమని మండిపడ్డారు.