- కార్లు, బైక్ లపై వేలల్లో వెళ్లి రూ.కోట్లలో పందేలు
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీప ఏపీ సరిహద్దుల్లో రద్దీ
- ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేసిన పోలీసులు
ఖమ్మం, పెనుబల్లి, వెలుగు : సంక్రాంతి కోడి పందేలకు తెలంగాణలో అనుమతి లేకపోవటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పందెం రాయుళ్లు భారీగా ఏపీకి తరలివెళ్లారు. అక్కడ కోడిపందేల్లో రూ. కోట్లలో పందేలు కట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర రంగాలకు చెందినవారు కార్లు, బైక్‌లపై వేలాదిగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లి పందేల్లో పాల్గొన్నారు. తెలంగాణ పందెం రాయుళ్లతో ఆంధ్రాలో కోడి పందేల్లో జోరు కనిపించింది.
ఏపీలోని తిరువూరు, తోకపల్లి, కోకిలంపాడు, చింతంపల్లి, సీతానగరం, పుట్రేల, తాత కుంట్ల , కాకర్ల ప్రాంతాలు తెలంగాణకు సరిహద్దుకు సమీపంలోనే ఉండగా.. అక్కడి మామిడి తోటలు, కొబ్బరి, పామాయిల్ తోటల్లో ప్రత్యేక టెంట్లు వేసి కోడి పందేలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం శివారు ఆంధ్ర సరిహద్దు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కోడి పందేల బరులు ఉండటంతో రాష్ట్రానికి చెందిన పందెం రాయుళ్లు పోటెత్తారు. పార్కింగ్ లో అన్ని వాహనాలు తెలంగాణ నుంచి వచ్చినవే కనిపించాయి.
సినిమా సెట్టింగ్ లను తలపించేలా..
ఏపీ సరిహద్దు ప్రాంతమైన విసన్నపేటలోని తాతకుంట్లలో సినిమా సెట్టింగ్స్ ను తలపించేలా పందెం బరులు, భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కోడి పందేలు చూడటానికి మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. మగవాళ్లతో పాటు మహిళలు కోడి పందేలే కాకుండా.. నంబర్ల ఆట, గుండాట, ఎరుపు నలుపు ఆటల్లోనూ పందేలు కట్టారు. మరోవైపు పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి వీఎం బంజర పోలీసులు పందెం రాయుళ్లు ఆంధ్రకు వెళ్లకుండా అడ్డుకోవటానికి తనిఖీలు చేశారు. అయినా.. తిరువూరు పరిధిలో పందేల కోసం సరిహద్దు దాటి వెళ్లారు. ముత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద పందెం రాయుళ్లను అడ్డుకొని కోడి పుంజులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.